మెరిసిన స్వీటీ.. ట్రెండింగ్‌లో స్టిల్స్‌

స్టార్‌ హీరోయిన్‌ అనుష్క చాలా రోజుల తర్వాత అభిమానులకు దర్శనమిచ్చారు. ఆమె తాజా ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్‌మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. అనుష్క ఈజ్‌ బ్యాక్‌ అంటూ అభిమానులు తెగ ఆనంద పడిపోతున్నారు. ఈ ఫొటోలు ప్రస్తుతం ట్విటర్‌ ట్రెండింగ్‌లో ఉన్నాయి. అనుష్క స్టిల్స్‌ను ఫ్యాన్స్‌ విపరీతంగా షేర్‌ చేస్తున్నారు. స్వీటీ తెలుపు వర్ణం దుస్తుల్లో సముద్రం ఒడ్డున కూర్చుని ఎంతో అందంగా కనిపించారు. ఫొటోగ్రాఫర్‌ సుందర్‌ రాము ఈ ఫొటోల్ని క్లిక్‌ మనిపించారు. అంతేకాదు ఈ ఫొటోల్లో ఆమె మునుపటికంటే నాజూకుగా కనిపించారు.

అనుష్క ‘సైజ్‌జీరో’ సినిమా కోసం బరువు పెరిగారు. తర్వాత క్రమక్రమంగా బరువు తగ్గుతూ వచ్చారు. ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ బ్లాక్‌బస్టర్‌ తర్వాత గత ఏడాది ఆమె ‘భాగమతి’తో ఆకట్టుకున్నారు. దీని తర్వాత ట్రీట్‌మెంట్‌ కోసం అనుష్క అమెరికా వెళ్లి, వచ్చారట. ఈ క్రమంలోనే ఆమె సినిమాలకు దూరం అవుతున్నారని వదంతులు వచ్చాయి. చాలా రోజుల తర్వాత ఇటీవల ఆమె ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్. రాజమౌళి కుమారుడు కార్తికేయ వివాహంలో కనిపించారు.

మార్చి నెలలో అనుష్క కొత్త ప్రాజెక్టు ప్రారంభం కాబోతోంది. ఈ సినిమాకు హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వం వహించబోతున్నారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్‌ కార్పొరేషన్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మాధవన్‌, అంజలి, షాలినీ పాండే, సుబ్బరాజు, అవసరాల శ్రీనివాసరావు తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించబోతున్నారు. ఈ చిత్రానికి ‘సైలెన్స్‌’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం.