ఏపీ మంత్రివర్గ సమావేశంలో సంచలన నిర్ణయాలు

ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన సుమారు ఆరు గంటల పాటు జరిగిన ఈ భేటీలో పారిశుద్ధ్య, అంగన్‌వాడీ, మధ్యాహ్న భోజనం కార్మికులకు భారీగా వేతనాలు పెంపుతో పాటు అనేక కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసింది. మంత్రులెవరైనా అవినీతికి పాల్పడితే మంత్రివర్గం నుంచి తొలగిస్తామని సీఎం గట్టిగా చెప్పారని సమాచార, ప్రసారాల శాఖ మంత్రి పేర్ని నాని వెల్లడించారు. దేశమంతా ఏపీ వైపు చూసేలా తమ ప్రభుత్వ కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. మానవీయ కోణంలో ఆలోచించి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కేబినెట్‌ నిర్ణయించిందని, అయితే.. దీనిపై ఆర్థిక, రవాణాశాఖల మంత్రుల సారథ్యంలో కమిటీ వేయనున్నట్టు తెలిపారు. విలీనంపై నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోనున్నారు. అమ్మ ఒడి కార్యక్రమాన్ని వచ్చే ఏడాది జనవరి 26 నుంచి ప్రారంభించనున్నట్టు తెలిపారు. కేబినెట్‌ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను నాని మీడియాకు వివరించారు.

ఏపీ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు:
– సీపీఎస్‌ రద్దు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయం. ఆర్థిక మంత్రి ఛైర్మన్‌గా దీనిపై కార్యాచరణ కమిటీ ఏర్పాటు.
– గిరిజన ప్రాంతాల్లోని కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్లకు వేతనం రూ.4వేలకు పెంపు
– సీఎం అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రైతు కమిషన్‌ ఏర్పాటుకు నిర్ణయం. దీనిలో ఆరు లేదా ఏడుగురు సభ్యులు. దీనిలో రైతు సంఘ నాయకులు, నిపుణులు సభ్యులుగా ఉంటారు. వ్యవసాయంలో పురోగతి, రైతు సంక్షేమం, ధరల స్థిరీకరణను ఈ కమిషన్‌ పర్యవేక్షిస్తుంది. త్వరలోనే ఇది ఏర్పాటు.
– గ్రామ వాలంటీర్లను పార్టీలకతీతంగా పారదర్శకంగా ఎంపిక చేస్తాం. పట్టణాల్లో వాటికి ఉత్తీర్ణత డిగ్రీ, గ్రామాల్లో ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత, గిరిజన ప్రాంతాల్లో పదో తరగతి ఉత్తీర్ణతగా నిర్ణయించాం. ఆగస్టు 15 నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయం. గ్రామ సచివాలయానికీ అవసరమైన ఉద్యోగాల నియామకం చేపడతాం.
– ఆర్టీసీ కార్మికుల సమస్యలపై గత ప్రభుత్వం ఏర్పాటుచేసిన అన్ని కమిటీలు రద్దు.
– ఆర్టీసీలో ఎలక్ట్రిక్‌ బస్సులను తీసుకురావాలని నిర్ణయం.
– టీటీడీ పాలకమండలిని రద్దు చేసేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయం
-ఆరోగ్యశ్రీ పరిధిలోకి మరిన్ని వ్యాధులు.
– అక్టోబర్‌ 15న రైతుభరోసా ప్రారంభం. రైతులకు ఏడాదికి రూ.12,500. రాష్ట్రంలో సుమారు 50 లక్షలకు పైగా రైతులకు ప్రయోజనం.
– రైతులకు· వడ్డీలేని రుణాలు అందించాలని కేబినెట్‌ నిర్ణయం. వైఎస్సార్‌ పేరుతో కార్యక్రమానికి రూపకల్పన. పంట రుణాలు తీసుకున్న ప్రతి రైతుకూ వడ్డీ చెల్లించే అవసరం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే బ్యాంకులతో ఒప్పందం చేసుకుని ఆ వడ్డీలను బ్యాంకులకు చెల్లిస్తుంది. వడ్డీ రశీదును గ్రామ వాలంటీర్ల ద్వారా రైతులకు అందజేస్తాం.
– 2014 నుంచి 2019 వరకు రైతులకు చెల్లించకుండా ఉంచిన రూ.2వేల కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ బకాయిలను తక్షణమే చెల్లించాలని నిర్ణయం.
– రూ.2వేల కోట్లతో ప్రకృతి వైపరీత్యాల సహాయనిధి
– రూ.3వేల కోట్లతో మార్కెట్‌ ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుకు నిర్ణయం.
– పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు రైతులకు ఉచిత బోర్ల ఏర్పాటుకు పార్లమెంట్‌ నియోజకవర్గానికి ఒకటి, అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున రిగ్గులను అందుబాటులో ఉంచి ప్రాధాన్యతల వారీగా ఉచితంగా బోర్లు వేయించాలని నిర్ణయం.
– పండించిన పంటకు కనీస మద్దతు ధర రాని చోట్ల ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నిర్ణయం
– పంటల బీమా ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించాలని నిర్ణయం. పంట నష్టం జరిగి క్లెయిమ్‌ను రైతుకు అందజేసే బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకుంటుంది.
– గ్రామాల్లో అర్హత కలిగి ఇంటి స్థలం లేక ఇబ్బందులు పడుతున్న వారిని గుర్తించి ఇళ్ల స్థలాలు ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆ ఇంటి ఇల్లాలి పేరుపై రిజిస్ట్రేషన్‌ చేసి ఉగాది రోజున పట్టాలు అందివ్వాలని నిర్ణయం. రెండో ఏడాది నుంచి పక్కా ఇళ్ల నిర్మాణ కార్యక్రమం.. 25 లక్షల ఇళ్లు నిర్మించాలని నిర్ణయం.
– జ్యుడీషియల్‌ కమిటీ ఏర్పాటు చేయాలని సీజేను కోరిన సీఎం .
– అమ్మ ఒడి కార్యక్రమం జనవరి 26 నుంచి ప్రారంభం. అదే రోజున పిల్లల్ని చదివించే ప్రతి తల్లికీ చెక్కుల్ని అందించాలని నిర్ణయం.
– సహకార రంగం పునరుద్ధరించాలని కేబినెట్‌ నిర్ణయం. మూతపడిన చక్కెర కర్మాగారాలను తెరిపించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చ.
– జులై 1 నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 27శాతం మధ్యంతర భృతి అమలు చేయాలని నిర్ణయం. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.815 కోట్ల అదనపు భారం. ఈ నిర్ణయంతో నాలుగు లక్షలకు పైగా ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది.
– అర్హత, అనుభవం ఆధారంగా కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్దీకరణకు కేబినెట్‌ నిర్ణయం. దీనిపై కేబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం.
– అన్ని విభాగాల్లోని కాంట్రాక్ట్‌ పారిశుద్ధ్య కార్మికులకు రూ.18వేల వేతనం ఇవ్వాలని నిర్ణయం. దీని అమలుకు ‘కమిటీ ఆఫ్‌ సెక్రటరీస్‌’ ఏర్పాటు.
– మెప్మా, సెర్ప్‌లో డ్వాక్రా మహిళా సంఘాలకు సేవలందిస్తున్న ఉద్యోగులకు రూ.10వేల గౌరవవేతనం అందివ్వాలని నిర్ణయం.
– అంగన్వాడీ వర్కర్లు, ఆయాలకు వేతనం పెంపు. అంగన్వాడీ వర్కర్ల వేతనం 11,500కు పెంపు.
– రేషన్‌ దుకాణాల ద్వారా నాణ్యమైన బియ్యాన్ని పంపిణీ చేయాలని నిర్ణయం. మరో ఐదు లేక ఆరు నిత్యావసర సరకులు పంపిణీ.. సెప్టెంబర్‌ 5 నుంచి అమలు. గ్రామవాలంటీర్ల ద్వారా ఇంటింటికీ నిత్యావసరాల పంపిణీకి నిర్ణయం.
– ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని నిర్ణయం. ప్రస్తుతం ఉన్న పాఠశాలల యథాస్థితిని ఫొటోలు తీసి, వాటిని మరమ్మతులు చేయించి తర్వాత మళ్లీ ఫొటోలు తీసి ఎలా మారాయనేది వివరించనున్నారు.
– మధ్యాహ్న భోజనం కార్మికుల వేతనాలను రూ.3వేలకు పెంపు