ఏపీ హైకోర్టు శాశ్వత భవన నిర్మాణానికి శంకుస్థాపన

నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఏపీ హైకోర్టు శాశ్వత భవన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. హైకోర్టు శాశ్వత భవన సముదాయాలకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు హాజరయ్యారు. పూజా కార్యక్రమంలో పాల్గొని శిలాఫలకాన్ని రంజన్‌గొగొయ్‌ ఆవిష్కరించారు. మొత్తం 450 ఎకరాల్లో బౌద్ధ స్థూపాకృతిలో న్యాయనగరం నిర్మితం కానుంది. హైకోర్టు భవన నిర్మాణ విశేషాలతో కూడిన గ్యాలరీని సీజేఐ పరిశీలించారు. హైకోర్టు భవన నిర్మాణంపై అధికారులు వీడియో ప్రజంటేషన్‌ ఇచ్చారు. రూ.819 కోట్లతో 12.2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హైకోర్టు శాశ్వత భవనం నిర్మితం కానుంది.

అనంతరం ఆధునిక వసతులతో, అత్యంత ఆకర్షణీయంగా నిర్మించిన జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌ (హైకోర్టు) భవనాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి ప్రారంభించారు. ఈ భవన నిర్మాణాన్ని సీఆర్‌డీఏ ఎనిమిది నెలల రికార్డు సమయంలో పూర్తి చేసింది. రాజస్థాన్‌ నుంచి తెప్పించిన శాండ్‌స్టోన్‌తో తాపడం చేసి భవనాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దింది. రాజధానిలోని న్యాయనగరంలో నిర్మించిన ఈ జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌ భవనంలో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టును ఏర్పాటుచేస్తారు. శాశ్వత భవన నిర్మాణం పూర్తయ్యాక హైకోర్టును దానిలోకి తరలిస్తారు.