‘మీరు శ్రీదేవిని ద్వేషించేవారు కదా?’.. అర్జున్‌ కపూర్‌పై నెటిజన్‌ కామెంట్‌

బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ కపూర్‌ను ఓ నెటిజన్‌ విమర్శించారు. తనకంటే వయసులో 11 ఏళ్లు పెద్దదైన నటి మలైకా అరోరాతో అర్జున్‌ డేటింగ్‌లో ఉన్నారు. ఈ విషయాన్ని ఆయన మీడియా ముందు కూడా ఒప్పుకొన్నారు. దీని గురించి కుసుమ్‌ అనే యువతి ట్విటర్‌ వేదికగా అర్జున్‌కు సూటి ప్రశ్న వేశారు.

‘మీరు శ్రీదేవిని ద్వేషించేవారు. ఎందుకంటే మీ తండ్రి బోనీ కపూర్‌ మీ అమ్మను వదిలేసి ఆమెను పెళ్లి చేసుకున్నారని. మరి మీరు వయసులో మీకంటే 11 ఏళ్లు పెద్దదైన మహిళతో ఎలా డేటింగ్‌ చేస్తున్నారు? పైగా ఆమెకు ఓ టీనేజ్‌ కుమారుడు కూడా ఉన్నాడు. మీ తండ్రికి ఒక రూల్‌ మీకొక రూలా?’ అని కామెంట్‌ చేశారు.

ఇందుకు అర్జున్‌ వెంటనే తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ‘కుసుమ్‌.. నాకు ఎవ్వరిపైనా ద్వేషం లేదు. కాకపోతే నా తండ్రి రెండో కుటుంబానికి నేను కాస్త దూరంగా ఉండేవాడిని. మీరన్నట్లు నేను శ్రీదేవిని ద్వేషించి ఉంటే.. ఆమె కుమార్తెలు జాన్వి, ఖుషిలను నా చెల్లెళ్లుగా స్వీకరించేవాడిని కాదు కదా? కామెంట్‌ చేయడం సులువే. కానీ అలా అనేముందు కాస్త ఆలోచించండి. అదీకాకుండా మీరు నటుడు వరుణ్‌ ధావన్‌ అభిమాని అని మీ ఖాతాను బట్టి తెలుస్తోంది. కాబట్టి ఆయన పేరును వాడుకుంటూ ఇలా నెగిటివిటీని ప్రచారం చేయకండి’ అని చెప్పారు.

దాంతో తన తప్పును తెలుసుకున్న కుసుమ్‌ వెంటనే అర్జున్‌కు క్షమాపణలు చెప్పారు. ఈ ట్వీట్‌ వరుణ్‌ ధావన్‌ దృష్టికి రావడంతో ఆయన కూడా స్పందించారు. ‘మీరు అర్జున్‌కు క్షమాపణలు చెప్పినందుకు నాకు సంతోషంగా ఉంది కుసుమ్‌. అర్జున్‌ది గొప్ప మనసు. నా అభిమానులు ఇతర నటీనటులను చులకనగా చూడకూడదని కోరుకుంటున్నాను’ అని ట్వీట్‌ చేశారు.