బిగ్‌బాస్‌: అలీ రెజా రీఎంట్రీ..?

బిగ్‌బాస్‌ ఇంటి నుంచి ఏడోవారం అలీ రెజా బయటకు వచ్చేసిన సంగతి తెలిసిందే. ఈ మూడో సీజన్‌లో ఇచ్చే టాస్క్‌లు అంతంతమాత్రంగా ఉన్నా.. వాటిల్లోనూ బెస్ట్‌ ఇచ్చేందుకు ప్రయత్నించే హౌస్‌మేట్స్‌ తక్కువ మందే ఉన్నారు. వారిలో అలీరెజా ముందువరుసలో ఉంటాడు. అలాంటి అలీ.. ఆరు వారాల పాటు నామినేషన్‌ జోన్‌లోకి రాలేదు. స్ట్రాంగెస్ట్‌ కంటెస్టెంట్‌ అంటూ అలీని ఇంటి సభ్యులు ఏడో వారంలో నామినేట్‌ చేశారు. అలీ రెజా ఎలిమినేట్‌ అవుతారని ఎవ్వరూ ఊహించలేదు. దీంతో ఖంగుతిన్న ఇంటిసభ్యులు భోరున విలపించారు. శివజ్యోతి, శ్రీముఖి కన్నీరును ఆపుకోలేకపోయారు.

అయితే అలీ రెజాకి బయట అంత వ్యతిరేఖత లేకపోయినా.. అతను ఎలిమినేట్‌ కావడం ఆయన ఫ్యాన్స్‌కు విచిత్రంగా అనిపిస్తోంది. దీంతో అలీని ఎలాగైనా.. రీఎంట్రీ ఇచ్చి హౌస్‌లోకి రావాలని కోరుకుంటున్నారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ట్వీట్లు, హ్యాష్‌ట్యాగ్స్‌తో కామెంట్లు చేస్తున్నారు. బిగ్‌బాస్‌లో యాభై రోజులు పూర్తవ్వడంతో.. మిగిలిన సెకండ్‌పార్ట్‌ను మరింత కఠినతరం చేయనున్నట్లు తెలుస్తోంది. గత సీజన్‌లో మాదిరి ఎలిమినేట్‌ అయిన కంటెస్టెంట్లలోంచి ఇద్దరికి రీఎంట్రీ ఇచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

అయితే ఇలాంటి అవకాశం వస్తే అలీకి అవకాశం ఇద్దామని నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. మరి నిజంగా అలాంటి ఛాన్స్‌ బిగ్‌బాస్‌ ఇస్తే.. హేమ, జాఫర్‌, తమనా​, రోహిణి, అషూ, అలీ.. వీరందరిలో ఎవరికి ఓట్లు అధికంగా వస్తాయో చూడాలి. అలీ ఉంటేనే షోలో గట్టి పోటీ ఉంటుందని కామెంట్లు చేస్తున్నారు. ఈ వారం నామినేషన్‌ ప్రక్రియ మొదలైనట్లు.. తాజాగా విడుదల చేసిన ప్రోమోల ద్వారా తెలుస్తోంది. మరి రీఎంట్రీ గురించి బిగ్‌బాస్‌ ఎప్పుడు ప్రకటిస్తాడో చూడాలి.