
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా.. స్టార్ డైరెక్టర్ శంకర్ తో దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కొంత భాగం షూటింగ్ పూర్తయింది. ఇందులో రామ్ చరణ్ డ్యుయెల్ రోల్ లో నటిస్తున్నాడని వార్తలు రావడంతో ఈ సినిమాపై భారీ హైప్ నెలకొంది.
కాగా ఈ సినిమాకు బీజేపీ నేతల సెగ తగిలింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. అయితే ఈ సినిమా షూటింగ్ స్థానిక బీజేపీ నేతలు అడ్డుకోవడం కలకలం రేపింది. సరూర్ నగర్ వీఎం హోంలో ఈ మూవీ చిత్రీకరణ జరుగుతుండగా.. స్థానిక బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అంజన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. విద్యార్థుల తరగతులు జరుగుతున్న వేళ షూటింగులకు అనుమతి ఏ విధంగా ఇస్తారని శ్రీవాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే రామ్చరణ్ సినిమా షూటింగు ఆపేయాలని ఆమె బీజేపీ శ్రేణులతో కలిసి ధర్నా చేపట్టారు. సినిమా షూటింగుల కారణంగా పిల్లలకు చదువుకోవడం ఇబ్బందికరంగా మారుతుందని ఆమె ఆరోపిస్తున్నారు.













