కొత్త అమ్మాయిలతో బన్నీ, అఖిల్!

తెలుగు చిత్రసీమలో కథానాయికల కొరత బాగా ఉండేది. అయితే కొత్త హీరోయిన్లు టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి ఆ కొరతను కొంతవరకు తగ్గించారు. అయితే ఇప్పుడు స్టార్ హీరోయిన్లు, కొత్త హీరోయిన్లు ఎవరికి వారు తమ ప్రాజెక్ట్స్ తో బిజీగాఉండడంతో కాల్షీట్స్ సమస్య వస్తోంది. దర్శకనిర్మాతలు కూడా కొత్త కాంబినేషన్స్ ను తెరపై చూపించడానికి ఆసక్తి చూపుతున్నారు. దీంతో కొత్త భామల వేట మరోసారి మొదలైంది. అఖిల్ రెండో సినిమా షూటింగ్ ఒక షెడ్యూల్ పూర్తయినా.. సరే ఇప్పటికీ కూడా హీరోయిన్ ఎవరనే విషయంలో స్పష్టత రాలేదు. నాగార్జున, అఖిల్ సినిమాలో కొత్త అమ్మాయి కనిపిస్తుందని చెప్పారు కానీ ఇంకా ఎవరినీ ఫైనల్ చేయలేదు.
కొంతమంది అమ్మాయిలను ఆడిషన్స్ కూడా చేశారు. అలానే మరోవైపు అల్లు అర్జున్ కోసం హీరోయిన్ వేట మొదలైంది. ప్రస్తుతం దువ్వాడ జగన్నాథం సినిమాలో నటిస్తోన్న అల్లు అర్జున్ ఆ తరువాత వక్కంతం వంశీ సినిమాలో కనిపించనున్నాడు. ఈ నెల 21న సినిమా మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈలోగా సినిమాలో హీరోయిన్ ను ఎంపిక చేయాలని చూస్తున్నారు. ఈసారి బన్నీ పక్కన కొత్త అమ్మాయి కనిపించనుంది. ఇటీవల గీతాఆర్ట్స్ లో కొంతమంది అమ్మాయిలను ఆడిషన్స్ చేసినట్లు తెలుస్తోంది. వాళ్ళలో ఒకరిని ఫైనల్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.