మరోసారి ఏపీకి కేంద్రం మొండిచేయి

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం మరోసారి మొండిచేయి చూపింది. రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన నిధులు విడుదల విషయంలో కేంద్రం ఇంకా ఎటూ తేల్చడంలేదు. ఈ ఏడాది మార్చిలో మొత్తం ఏడు జిల్లాలకు విడుదల చేసిన రూ.350 కోట్లను మోడీ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. అంతకుముందు విడుదల చేసిన నిధులకు సంబంధించిన యూసీలు, ఖర్చుల వివరాలు అందించని కారణంగా వాటిని వెనక్కి తీసుకుంటున్నట్టు కేంద్రం గతంలో వెల్లడించింది. దీంతో తక్షణమే స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం మార్చి నెలాఖరు కల్లా యూసీలు, ఖర్చుల వివరాలను అందించింది. ఆర్నెళ్లు గడుస్తున్నా ఈ నిధుల విడుదలకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఏపీతో పాటు పెండింగ్‌లో పెట్టిన తెలంగాణకు చెల్లించాల్సిన రూ.450 కోట్ల నిధులను మాత్రం వారం రోజుల క్రితమే విడుదల చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక, డీవోపీటీ అధికారులు ఉత్తర్వులు విడుదల చేశారు. అయితే, ఏపీ విషయంలో మాత్రం ఎలాంటి పురోగతి లేదని తేల్చి చెప్పారు. ఏపీలో వెనుకబడిన ఏడు జిల్లాలకు రూ.50 కోట్లు చొప్పున మొత్తం రూ.350 కోట్లు, తెలంగాణలో (పాత జిల్లాల ప్రకారం) తొమ్మిది జిల్లాలకు రూ.450 కోట్ల మేర చెల్లిస్తూ వస్తోన్న కేంద్రం ఈ సారి మాత్రం ఏపీకి మొండిచేయి చూపింది.