HomeTelugu Reviewsఅమ్మమ్మగారిల్లు మూవీ రివ్యూ

అమ్మమ్మగారిల్లు మూవీ రివ్యూ

సినిమా : అమ్మమ్మగారిల్లు
నటులు : నాగశౌర్య, షామిలి, రావు రమేష్, శివాజీ రాజా, సుమిత్ర, సుధ, హేమ తదితరులు
సంగీతం : కళ్యాణ్‌ రమణ
సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి, భాస్కరభట్ల
దర్శకత్వం : సుందర్‌ సూర్య
నిర్మాత : రాజేష్
బ్యానర్ : ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌

ఛలో చిత్రంలో ఘన విజయాన్ని అందుకున్న హీరో నాగశౌర్య. కుటుంబ కథా నేపథ్యంలో రూపొందిన “అమ్మమ్మగారిల్లు” తో వస్తున్నాడు. ఫ్యామిలీ ఆడియన్స్ టార్గెట్‌గా తెరకెక్కిన ఈ చిత్రం టైటిల్లోనే సినిమా నేపథ్యం చూపించేశారు. అమ్మమ్మగారింట్లో నాగశౌర్య ఏం చేశాడో తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

6 6

కథ : సీతామహాలక్ష్మి(సుమిత్ర)ది పిఠాపురంలో పెద్ద కుటుంబం. ఈమెకు ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. ఆస్తి పంపకాల్లో కొన్ని గొడవలొస్తాయి. పెద్దకొడుకు (రావు రమేష్‌) ఆస్తి కోసం తండ్రితో గొడవ పడుతుంటాడు. దీంతో కలత చెందిన కుటుంబ పెద్ద సూర్యనారాయణ(చలపతిరావు) మరణిస్తాడు. దాంతో కుటుంబం చెల్లాచెదురవుతుంది. ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు తలో దిక్కుకి వెళ్లిపోతారు. పెద్దల్లుడి కొడుకు సంతోష్(నాగశౌర్య)కు చిన్నప్పటి నుంచి అమ్మమ్మ అంటే చాలా ఇష్టం. విడిపోయిన ఆ కుటుంబాన్ని ఒక్కటి చేయాలనుకుంటాడు హీరో. దానికోసం హీరో ఏం చేశాడు? వారిని ఎలా కలిపాడన్నదే మిగతా కథ.

నటీనటులు: అమ్మమ్మ బాధల్ని తీర్చే మంచి మనవడిగా, కుటుంబాన్ని కలిపే పెద్ద మనిషిలా నాగశౌర్య బాగా చేశాడు. తన నటనలో పరిణితి బాగా కనిపిస్తుంది. పాత్రకు ఎంత అవసరమో అంత వరకే నటిస్తూ భావోద్వేగాలు పండించాడు. బాలనటి షామిలి ఓయ్ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినా చాలా గ్యాప్ తర్వాత ఈ సినిమాలో నటించింది. తన పాత్ర మేరకు న్యాయం చేసింది షామిలి. కుటుంబ కథల్లో రావురమేశ్ ఎంత బాగా చేస్తాడో ఈ సినిమాలో మరోసారి నిరూపించుకున్నాడు. రావు రమేష్ నటన చిత్రానికి హైలైట్‌గా నిలిచింది. మామ, అల్లుళ్ల మధ్య కథనం ఆడియన్స్‌ను కట్టిపడేస్తుంది. షకలక శంకర్ తన కామెడీతో ఆకట్టుకున్నాడు. అమ్మమ్మగా చేసిన సుమిత్ర కంటతడి పెట్టించారు. మిగతా పాత్రల్లో శివాజీ రాజా, రవి ప్రకాష్, హేమ, సుధ తదితరుల పాత్రలు అలరిస్తాయి. పోసాని, గౌతంరాజు, సమ్మెట రాజు గుర్తుండిపోయే పాత్రలు చేశారు.

6b

విశ్లేషణ: పదునైన మాటలతో మనసును తాకేలా చేశారు డైరెక్టర్ సుందర్ సూర్య. డైలాగ్స్ బాగా ఆకట్టుకున్నాయి. బరువైన బంధాలను బరువైన సంభాషణలతో నడిపించాడు. టైటిల్ చూసి కథేంటో ప్రేక్షకుడు అంచనా వేసేస్తాడు. అయితే అందరూ ఊహించేదే అయినా ప్రేక్షకుడిని ఆకట్టుకునేలా ప్రజెంట్ చేస్తే ఆదరణ పొందుతుంది. కథను తీర్చి దిద్దిన విధానం దర్శకుడి ప్రతిభను మెచ్చుకునేలా చేసింది. సినిమా స్థాయికి నిర్మాణ విలువలు ఉన్నాయి. కల్యాణ్ రమణ సంగీతం ఆకట్టుకుంది. చిత్రంలోని పాటలు కథతో పాటు వచ్చివెళ్లినట్లు అనిపిస్తుంది. ఎడిటింగ్ బాగుంది. జీవితంలో డబ్బుకంటే కుటుంబం, అనుబంధాలే గొప్పవని గుర్తుచేసిన సినిమా. బిజీ లైఫ్‌లో మనం కోల్పోతున్నదేంటో తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని ఒకసారైనా చూడాల్సిందే.

హైలైట్స్
నాగశౌర్య, రావురమేష్ నటన
కుటుంబ నేపథ్యం, సంగీతం, డైలాగ్స్

డ్రాబ్యాక్స్
అక్కడక్కడా సాగదీసే సన్నివేశాలు
కథలో కొత్తదనం లేకపోవడం

(గమనిక: ఇది కేవలం వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

Recent Articles English

Gallery

Recent Articles Telugu