‘ఛపాక్‌’ ట్రైలర్‌ విడుదల

బాలీవుడ్‌ తార దీపికా పదుకొణె ‘పద్మావత్‌’ తర్వాత నటిస్తున్న సినిమా ‘ఛపాక్‌’. యాసిడ్‌ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్‌ జీవితం ఆధారంగా హిందీలో రూపొందుతున్న సినిమా ఇది. ‘రాజీ’ ఫేం మేఘనా గుల్జార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌కు ప్రశంసలు లభించాయి. మంగళవారం చిత్ర బృందం సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది.

‘మాకు న్యాయం కావాలి, న్యాయం కావాలి..’ అని యువత ఆందోళన చేస్తున్న డైలాగ్‌తో ఈ ప్రచార చిత్రం ఆరంభమైంది. ఓ యువకుడు అందమైన దీపిక (మాలతి) ముఖంపై యాసిడ్‌ చల్లడంతో తొలుత ఆమె మానసికంగా కుంగిపోయారు. ఆ పై న్యాయం కోసం ఆమె చేసిన పోరాటంతో కూడిన సన్నివేశాలు స్ఫూర్తిని నింపేలా ఉన్నాయి. ‘యాసిడ్‌ అమ్మడం ఆపేస్తే ఎంత బాగుంటుంది. ఈ దాడులు ఆగిపోతాయి’ అంటూ దీపిక ఆవేదన చెందారు. ‘అతడు నా ముఖాన్ని నాశనం చేశాడు..

నా ఆత్మవిశ్వాసాన్ని కాదు..’ అని దీపిక చివర్లో చెప్పడం హైలైట్‌గా నిలిచింది. లక్ష్మీ అగర్వాల్‌ 2005లో బస్టాండులో ఉండగా ఓ వ్యక్తి యాసిడ్‌తో దాడి చేసి పారిపోయాడు. ఆమె తనతో పెళ్లికి నిరాకరించిందనే కోపంతో ఆ వ్యక్తి అంతటి దారుణానికి పాల్పడ్డాడు. ఈ నిజ జీవిత సంఘటనలతో తీసిన ‘ఛపాక్‌’ 2020 జనవరి 10న విడుదల కాబోతోంది.

CLICK HERE!! For the aha Latest Updates