అవి కన్ఫ్యూజ్‌ చేసి నాతో ఆడేసుకున్నాయి: చిరంజీవి

మెగాస్టార్‌ చిరంజీవి ఇటీవలే కరోనా బారినపడినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా చేసిన పరీక్షల్లో ఆయనకు కొవిడ్‌ నెగెటివ్‌ వచ్చింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్‌లో అభిమానులతో పంచుకున్నారు. నాలుగు రోజుల క్రితం ఆయనకు కరోనా వచ్చినట్లు తేలినా ఎలాంటి లక్షణాలూ కనిపించలేదు. దీంతో అనుమానం వచ్చి వైద్యులను సంప్రదించారు. తాజాగా చేసిన ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షలో కరోనా లేదని తేలింది. తాను త్వరగా కోలుకోవాలని ప్రార్థించి, తన క్షేమాన్ని కోరిన వారందరికీ చిరంజీవి కృతజ్ఞతలు చెప్పారు. కరోనా పాజిటివ్‌ నుంచి నెగెటివ్‌ వచ్చిన క్రమాన్ని ఆయన ట్విటర్‌లో పంచుకున్నారు.

‘కాలం, కరోనా గత నాలుగు రోజులుగా నన్ను కన్ఫ్యూజ్‌ చేసి నాతో ఆడేసుకున్నాయి. ఆదివారం చేసిన కరోనా పరీక్షల్లో పాజిటివ్‌ అని తేలింది. అప్పటి నుంచి బేసిక్‌ మెడికేషన్‌ ప్రారంభించాను. రెండు రోజులైనా ఎలాంటి లక్షణాలు కనిపించకపోయేసరికి అనుమానం వచ్చింది. దీంతో అపోలో వైద్యులను సంప్రదించాను. వాళ్లు సీటీ స్కాన్‌ చేసి ఛాతిలో ఎలాంటి కరోనా జాడలు లేవని నిర్ధారించారు. అక్కడ నెగెటివ్‌ వచ్చిన తర్వాత కూడా మూడు రకాల కిట్లతో పరీక్షలు చేయించుకున్నాను. ఆఖరికి.. నాకు కరోనా పాజిటివ్‌ రిపోర్టు ఇచ్చిన చోట కూడా ఆర్‌టీ-పీసీఆర్‌ టెస్ట్‌ చేయించాను. అక్కడా కరోనా నెగెటివ్‌ అని తేలింది. మొదట పరీక్ష చేసిన కిట్‌లో లోపం వల్ల ఈ తప్పిదం జరిగినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ సమయంలో మీరందరూ చూపించిన ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు’ అని ఆయన పేర్కొన్నారు.

CLICK HERE!! For the aha Latest Updates