ట్రైండ్‌ అవుతున్న మెగాస్టార్‌ చిరంజీవి మనవరాలి ఫొటో

మెగాస్టార్‌ చిరంజీవి మనవరాలు నవిష్క ఫొటోలు సోషల్‌మీడియాలో తెగ ట్రెండ్‌ అవుతున్నాయి. చిరు కుమార్తె శ్రీజ, కల్యాణ్‌ దేవ్‌ దంపతులకు కొన్ని నెలల క్రితం పాప జన్మించిన సంగతి తెలిసిందే. చిన్నారికి నవిష్క అని పేరు పెట్టారు. పాపను తొలిసారి తాతయ్య చిరు, అమ్మమ్మ సురేఖ ఎత్తుకుని ఉండగా తీసిన ఫొటోను కల్యాణ్‌ డిసెంబరులో షేర్‌ చేశారు.

నవిష్కకు నాలుగు నెలలు పూర్తయిన సందర్భంగా కల్యాణ్‌ చిన్నారి ముఖం చూపిస్తూ తొలిసారి ఫొటోలు షేర్‌ చేశారు. ‘ఇప్పుడు నాకు తొలిచూపులోనే ప్రేమ పుడుతుందన్న విషయంపై నీ వల్ల నమ్మకం కల్గింది. ఎందుకంటే నువ్వు పుట్టిన క్షణం నుంచి నేను నిన్ను ప్రేమిస్తున్నా నవిష్క’ అని కల్యాణ్‌దేవ్‌ పోస్ట్‌ చేశారు. ఇదే సందర్భంగా శ్రీజ కూడా తన కుమార్తె ఫొటోల్ని పంచుకున్నారు.

కల్యాణ్‌ ‘విజేత’ సినిమాతో హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. గత ఏడాది విడుదలైన ఈ సినిమా విజయం సాధించింది. దీని తర్వాత కల్యాణ్‌ తన రెండో ప్రాజెక్టుకు సంతకం చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. పులి వాసు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు తమన్‌ సంగీతం అందిస్తున్నారు.