‘చిత్రలహరి’ సినిమాపై స్పందించిన మెగాస్టార్‌ చిరంజీవి

సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా నటించిన ‘చిత్రలహరి’ సినిమా చక్కగా ఉందని మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు. కల్యాణి ప్రియదర్శన్‌, నివేదా పేతురాజ్‌ హీరోయిన్‌లుగా నటించారు. కిషోర్‌ తిరుమల ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించింది. ఏప్రిల్‌ 12న విడుదలైన ఈ సినిమాకు మంచి స్పందన లభించింది.

ఈ చిత్రం చూసిన చిరు స్పందించారు. సినిమాపై తన అభిప్రాయం పంచుకున్నారు. యువతకు మంచి సందేశం ఇచ్చారని మెచ్చుకున్నారు. ‘కిశోర్‌ తిరుమల ఈ సినిమాతో దర్శకుడిగా తన ప్రతిభను చాటారు. తేజు తన చక్కటి నటనతో పరిణితి సాధించిన నటుడిగా నిరూపించుకున్నాడు. పోసాని, సునీల్‌.. చాలా చక్కగా నటించి సినిమాకు నిండుదనం తెచ్చారు. సంగీతపరంగా దేవిశ్రీ మళ్లీ తన సత్తా చాటుకున్నారు. సక్సెస్‌ఫుల్‌ సినిమాలకు కేరాఫ్‌ అడ్రస్‌ మైత్రీ.. ఈ సినిమాతో వారి ఖ్యాతి మరింత పెరిగింది. ఈ సినిమాలో తండ్రీకొడుకుల బంధం గురించి చక్కగా చెప్పారు. ముఖ్యంగా యువతకు ఓ సందేశం ఇచ్చారు. ఎలాంటి ప్రతికూల పరిస్థితులు తారసపడినా.. మనం అనుకున్న లక్ష్యం సాధించడానికి కృషితో ముందుకెళ్తే చేయలేనిది ఏదీ లేదంటూ చాలా చక్కగా చెప్పిన సినిమా ‘చిత్రలహరి’. నటీనటులు, మొత్తం చిత్ర బృందానికి నా అభినందనలు. వేసవిలో విడుదలైన చక్కటి సినిమా ఇది’ అని చిరు అన్నారు.

దీనికి సాయిధరమ్‌ ట్విటర్‌లో ప్రతిస్పందిస్తూ.. ‘మీ తీయని మాటలకు, మాకు ఎల్లప్పుడూ మద్దతుగా ఉన్నందుకు ధన్యవాదాలు మామ. ప్రస్తుతం నా ఫీలింగ్స్‌ను వివరించేందుకు మాటలు సరిపోవడం లేదు’ అని పోస్ట్‌ చేశారు.

CLICK HERE!! For the aha Latest Updates