చిరంజీవి ‘సైరా’ మూవీ ట్రైలర్‌

టాలీవుడ్‌ మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చారిత్రక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. తొలి స్వాతంత్ర్య సమర వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా అక్టోబర్‌ 2వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌తో పాటు మేకింగ్ వీడియో మెగా ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంది. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. కొద్దిసేపటి క్రితమే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్‌ను మూవీయూనిట్‌ తాజాగా విడుదల చేసింది.

ట్రైలర్‌లోనే యాక్షన్‌, సెంటిమెంట్‌, దేశ భక్తి చూపించారు. ‘నరసింహారెడ్డి సామాన్యుడు కాదు అతడు కారణజన్ముడు’ అంటూ మొదలైన ట్రైలర్‌.. చివరి వరకూ అందరినీ కట్టిపడేసింది. అంతేకాకుండా పలు డైలాగ్‌లు తెగ ఆకట్టుకుంటున్నాయి. ‘ఈ భూమ్మీద పుట్టింది మేము.. ఈ మట్టిలో కలిసేది మేము. మీకెందుకు కట్టాలిరా శిస్తు’, ‘స్వేచ్చ కోసం ప్రజలు చేస్తున్న తిరుగుబాటు, నా భరతమాత గడ్డ మీద నిల్చొని హెచ్చరిస్తున్నా, నా దేశం వదిలి వెళ్లిపోండి.. లేదా యుద్ధమే’ అంటూ చిరంజీవి చెప్పే డైలాగ్‌ ట్రైలర్‌కు హైలెట్‌గా నిలిచాయి. భారీ యాక్షన్‌ విజువల్స్‌లో రూపొందించిన ఈ ట్రైలర్‌ సినిమా మీద అంచనాలను మరింతగా పెంచేస్తోంది.