విజయ నిర్మల మృతిపట్ల ప్రముఖుల సంతాపం

విజయ నిర్మల కన్నుమూశారన్న వార్త తనని తీవ్రంగా కలచి వేసిందని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు. బాల నటిగా తెలుగు సినిమా రంగంలో ప్రవేశించి, పరిశ్రమించి పట్టుదలతో ఉన్నత శిఖరాలు అధిరోహించారు. రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు సహా ఎన్నో పురస్కారాలను పొందారు. అత్యధిక సినిమాలు తెరకెక్కించిన మహిళా దర్శకురాలిగా తెలుగు సినిమా రంగంలో మహిళల ప్రాధాన్యతను పెంచిన ఘనత శ్రీమతి విజయనిర్మల గారికి దక్కుతుంది. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని వెంకయ్యనాయుడు తెలిపారు.

విజయ నిర్మల కన్నుమూయడంపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపిన సీఎం జగన్‌ అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించి గిన్నిస్‌ బుక్ రికార్డు సాధించిన మేటి దర్శకురాలైన విజయనిర్మల మరణం చిత్రపరిశ్రమకు తీవ్ర లోటని సీఎం జగన్ విచారం వ్యక్తం చేశారు.

సీనియర్ నటి విజయనిర్మల మరణం దిగ్భ్రాంతికరం. నటిగానే కాక దర్శకురాలిగా అనేక కుటుంబ కథాచిత్రాలను అందించారు. అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళగా గిన్నిస్ రికార్డ్ నెలకొల్పారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ,వారి అభిమానులకు, కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను అని మాజీ సీఎం చంద్రబాబు అన్నారు.

విజయనిర్మలలాంటి ప్రతిభావంతురాలిని ఇప్పట్లో ఇంకెవరినీ చూడలేమని చిరంజీవి అన్నారు. విజయ నిర్మల హఠాన్మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. మ‌న తెలుగు ప‌రిశ్ర‌మ‌లో భానుమ‌తిగారి త‌ర్వాత గ‌ర్వించ‌ద‌గిన బ‌హుముఖ ప్ర‌జ్ఞాశాలి విజ‌య‌నిర్మ‌ల గారు. తన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేశారు ఆమె లేని లోటు యావ‌త్ తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌కి తీర‌ని లోటు అని చిరంజీవి అన్నారు.

న‌టిగా, ద‌ర్శ‌కురాలిగా, నిర్మాత‌గా త‌న‌దైన ప్ర‌త్యేక‌త‌ను సంపాదించుకున్న విజ‌య‌నిర్మ‌ల‌ గారు క‌న్నుమూయ‌డం ఎంతో బాధాక‌రం. సినీ రంగ పరిశ్ర‌మ‌లో మ‌హిళా సాధికార‌త‌ను చాటిన అతి కొద్ది మంది మ‌హిళ‌ల్లో విజ‌య‌నిర్మ‌ల‌గారు ఒక‌రు. నాన్న‌గారి పాండురంగ మ‌హ‌త్మ్యంలో కృష్ణుడిగా న‌టించారు. అదే ఆవిడ న‌టించిన తొలి తెలుగు సినిమా. ఆమె మృతి చిత్ర‌సీమ‌కు తీర‌నిలోటు. ఆమె ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని బాలకృష్ణ అన్నారు.

విజయనిర్మల అకాల మరణం దిగ్భ్రాంతికి గురి‌ చేసిందని నటిగా, దర్శకురాలిగా విజయ నిర్మలది చెరగని ముద్ర అని ఆయన పవన్ కల్యాణ్ అన్నారు. ఎన్నో హిట్ సినిమాలకు దర్శకత్వం వహించి.. దర్శక విభాగంలో మహిళలు ప్రవేశించేందుకు ఆదర్శంగా నిలిచారని పవన్ కల్యాణ్ అన్నారు.

విజయ నిర్మల జీవితం ఎంతో స్ఫూర్తిదాయకం. ఆమె ఇక లేరన్న వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. ఎంతటి బాధాకరమైన విషయం. విజయ నిర్మల ఇక లేరు. మిమ్మల్ని చాలా మిస్సవుతాం మేడమ్‌. మా పట్ల మీరు చూపించిన ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేమని దర్శకుడు శ్రీనువైట్ల అన్నారు. మీరు ఇండస్ట్రీకి వచ్చి చరిత్ర సృష్టించారు. మీరు సాధించినంతగా మున్ముందు తరాల వారు కూడా సాధించలేరేమో. మిమ్మల్ని మిస్సవుతాం అమ్మమ్మ అంటూ మంచు మనోజ్‌ అన్నారు.