‘లవర్స్‌ డే’ క్లైమాక్స్‌ మార్పు

మలయాళీ నటి ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ హీరోగా నటించిన సినిమా ‘ఒరు అడార్‌ లవ్‌’. ఒమర్‌ లులు దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగులో ‘లవర్స్‌ డే’ పేరుతో ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ప్రియా ప్రకాశ్‌ ద్వారా సినిమాకు ఎంతో పాపులారిటీ వచ్చింది కానీ సినిమా మాత్రం బాక్సాఫీస్‌ వద్ద డీలాపడిపోయింది. ముఖ్యంగా ఈ చిత్రంలోని క్లైమాక్స్‌ భాగం ప్రేక్షకులను నిరాశకు గురిచేసింది. దాంతో కేవలం క్లైమాక్స్‌ సన్నివేశాన్ని మార్చాలని చిత్రబృందం నిర్ణయించింది.

బుధవారం నుంచి కొత్త క్లైమాక్స్ సన్నివేశంతో సినిమా ప్రదర్శితమవుతుందని దర్శకుడు ఒమర్‌ వెల్లడించారు. ‘క్లైమాక్స్‌ సన్నివేశంలో మార్పులు చేసి మళ్లీ చిత్రీకరించాం. పది నిమిషాల పాటు ఈ సన్నివేశం ఉండబోతోంది. బుధవారం నుంచి కొత్త క్లైమాక్స్‌తో సినిమా ప్రదర్శితమవుతుంది. నేను తీసిన మూడో చిత్రమిది. నా మొదటి రెండు సినిమాలు కూడా రొమాంటిక్‌ కామెడీ నేపథ్యంలోనే ఉంటాయి. దాంతో ‘ఒరు అడార్‌ లవ్’ సినిమాను రియలిస్టిక్‌గా తెరకెక్కించాలని అనుకున్నాను. అందుకే క్లైమాక్స్‌కు ట్రాజెడీనీ జోడించాను. కానీ ప్రేక్షకులు ఈ సన్నివేశంతో నిరాశకు గురయ్యారు. దాంతో ఆ సన్నివేశాన్ని మార్చాలని నేను, నిర్మాత నిర్ణయించుకుని కొత్తగా మళ్లీ తెరకెక్కించాం’ అని వెల్లడించారు.