మే 23 తర్వాత ఆ ప్రభుత్వం రావడం ఖాయం: చంద్రబాబు

ఈ నెల 23న వెల్లడికానున్న ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఓటమిని చవిచూడబోతోందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. మే 23 తర్వాత కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వం రావడం ఖాయమన్నారు. తృణమూల్‌ కాంగ్రెస్‌కు మద్దతుగా బెంగాల్‌లో రెండు రోజుల పాటు పర్యటనకు వెళ్లిన చంద్రబాబు తొలిరోజు ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బెంగాల్‌ అభివృద్ధి కోసం తృణమూల్‌ కాంగ్రెస్‌కు ప్రజలంతా మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు. పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీని బెంగాల్‌ టైగర్‌తో పోల్చిన చంద్రబాబు.. బీజేపీయేతర ప్రభుత్వంలో ఆమె కీలక పాత్ర పోషిస్తారన్నారు. తామంతా ఆ పార్టీకి మద్దతుగా ఉన్నామన్నారు. ఎన్నికల్లో పారదర్శకత కోసమే తాము పోరాటం చేస్తున్నామని, 50శాతం వీవీప్యాట్‌ స్లిప్పులు లెక్కించాలని ఈసీఐని కోరుతున్నామని ఈ సందర్భంగా తెలిపారు. ఓటు వేశాక అందరూ వీవీప్యాట్‌ స్లిప్‌ని సరిచూసుకోవాలన్నారు. మనం వేసిన పార్టీకే ఓటు పడుతుందా లేదా అనేది చూసుకోవాలని సూచించారు. ఓటింగ్‌ సమయంలో ఎవరైనా తప్పుచేస్తే నిలదీయాలన్నారు.

CLICK HERE!! For the aha Latest Updates