ఎన్టీఆర్ పారితోషికం ఎంతో తెలుసా..?

త్వరలోనే ప్రముఖ ఛానెల్ లో ప్రసారం కానున్న ‘బిగ్ బాస్’ షోకి యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా 
వ్యవహరించనున్నారు. అయితే ఈ షో కోసం ఎన్టీఆర్ దాదాపు తొమ్మిది కోట్ల పారితోషికం తీసుకున్నట్లు వార్తలు వినిపించాయి. నిన్న జరిగిన కార్యక్రమంలో ఎన్టీఆర్ మీడియా ఊహించుకున్నంత పారితోషికం అయితే నేను తీసుకోవడం లేదని, కానీ నేను సంతృప్తి పడే మొత్తాన్ని నాకు ఇస్తున్నారని అన్నారు. అసలు ఈ షో కోసం ఎన్టీఆర్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడనే విషయంపై తాజాగా ఓ వార్త వెలుగులోకి వచ్చింది. ఒక ఎపిసోడ్ కు దాదాపు 50 లక్షల రూపాయలను తీసుకోబోతున్నాడు ఎన్టీఆర్. ఒక సీజన్ లో మొత్తం 12 ఎపిసోడ్లు ఉంటాయి. 
ఈ లెక్కన ఎన్టీఆర్ కు 6 కోట్ల రూపాయలు ముట్టజెప్పబోతున్నారు. మొత్తం ఈ షోను మూడు సీజన్లుగా నడిపించాలని ప్లాన్ చేస్తున్నారు. అంటే ఎన్టీఆర్ కు మొత్తం 18 కోట్ల వరకు పారితోషికం దక్కబోతుంది. అయితే ప్రతి షోలో ఎన్టీఆర్ కనిపించడు. పోటీదారులు మాత్రమే కనిపిస్తారు. వారాంతాల్లో మాత్రమే ఎన్టీఆర్ యాంకరింగ్ చేసి వెళ్ళిపోతాడు. గతంలో సీనియర్ హీరోలు హోస్ట్ చేసిన కార్యక్రమాలకు తీసుకున్న మొత్తం కంటే ఎన్టీఆర్ కు ఇచ్చే రెమ్యూనరేషన్ చాలా ఎక్కువనే చెప్పాలి.