వరద ప్రాంతాల్లో జగన్ ఏరియల్ సర్వే


భారీ వర్షాలతో అతలాకుతలమైన కర్నూలు జిల్లాలో సీఎం జగన్ ఏరియల్ సర్వే నిర్వహించారు. నంద్యాల, ఆళ్లగడ్డ, మహానంది ప్రాంతాల్లో పర్యటించి ఏరియల్‌ సర్వే ద్వారా ముంపు ప్రాంతాలను పరిశీలించారు. పంట నష్టాన్ని స్వయంగా పరిశీలించారు. నంద్యాలలో అధికారులతో సమావేశమై నష్టం వివరాలను తెలుసుకోవడంతోపాటు బాధితులకు అందించాల్సిన సాయంపైనా ఆరా తీశారు. వరద ప్రభావం, సహాయక చర్యలపై చర్చ జరిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.

గత ఐదు రోజులుగా కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వీటికి తోడు నల్లమలలోని అడవుల్లో భారీ వర్షాలతో ఆ నీరు నంద్యాల పట్టణంలోని శ్యామకాల్వ, మద్దిలేరువాగు, కుందూ నదిలోకి చేరుకుంది. దీంతో నంద్యాల పట్టణాన్ని వరదనీరు చుట్టుముట్టింది. పట్టణంలోని శ్యామకాల్వ, మద్దిలేరువాగు, కుందూనది ఉప్పొంగి ప్రవహించడంతో చాలా కాలనీలు జలమయమయ్యాయి.