CM PreCondition to Film Industry:
ఏదైనా పెద్ద సినిమా విడుదల అవుతుంది అనగానే చిత్ర దర్శక నిర్మాతలు వెంటనే సినిమా టికెట్ రేట్లు పెంచమని ప్రభుత్వాన్ని కోరుతూ ఉంటారు. ఈ మధ్యనే విడుదలైన ప్రభాస్ కల్కి 2898 ఏడి సినిమా విషయంలో కూడా టికెట్ రేట్లు పెంచమని చిత్ర బృందం తెలంగాణ ప్రభుత్వంతో పాటు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కూడా కలిసి విన్నవించుకున్నారు. దానికి తగిన పర్మిషన్స్ తీసుకున్నారు. అయితే ఇకపై టికెట్ రేట్లు పెంచాలి అంటే ఒక పని చేయాలి అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కండిషన్ పెట్టారు.
“మీ కొత్త సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు సినిమా టికెట్ ధరలు పెంచమని ప్రభుత్వం దగ్గరికి వచ్చి జీవోలు పెడుతున్నారు కానీ సామాజిక సమస్యలైన సైబర్ క్రైమ్, డ్రగ్ నియంత్రణ ఆ విషయంలో మీరు మీ వంతు బాధ్యతలు నెరవేర్చడం లేదు అని మా ప్రభుత్వం భావిస్తుంది. అందుకే నేను మా అధికారులకి సూచిస్తున్నాను. రేపు ఎవరైనా తమ సినిమా విడుదల అవుతుంది టికెట్ ధరలు పెంచమని కోరడానికి వస్తే ఆ సినిమాలో ఎవరైతే స్టార్లు నటిస్తున్నారో.. వాళ్లతోనే సైబర్ క్రైమ్ నియంత్రణ, డ్రగ్స్ నియంత్రణ గురించి వీడియోలు తీసి విడుదల చేయాలి. అదే మా ప్రీ కండిషన్” అని అన్నారు రేవంత్ రెడ్డి.
“సమాజం నుంచి మీరు ఎంతో కొంత తీసుకుంటున్నారు. అందుకే ఆ సమాజాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా మీకు ఉంది. మీరు ఎన్నో కోట్లు పెట్టి సినిమా తీస్తున్నామని టికెట్ ధరలు పెంచమని వస్తున్నారు. మీ వ్యాపారం మంచిదే కానీ మీ సామాజిక బాధ్యత అయిన డ్రగ్స్ నియంత్రణ, నియంత్రణ వంటిది జరగకపోతే సమాజమే నిర్వీర్యం అవుతుంది” అని గుర్తు చేశారు రేవంత్ రెడ్డి.
సమాజాన్ని కాపాడాల్సిన బాధ్యత సినీ పరిశ్రమకి ఉంది అని అన్న రేవంత్ రెడ్డి ఇకపై ఎవరైనా సినీ పరిశ్రమ వాళ్ళు ప్రభుత్వం నుంచి సహాయం కోరడానికి వస్తే వాళ్లు కనీసం ఒకటిన్నర లేదా రెండు నిమిషాల వీడియో డ్రగ్స్ నియంత్రణ, సైబర్ క్రైమ్ నియంత్రణ గురించి వీడియోలు తీసుకొని రావాలని అప్పుడే వాళ్లకి వెసులుబాటు లభిస్తుందని స్పష్టం చేశారు.
CM PreCondition to Film Industry:
సినిమా టికెట్ రేట్ల విషయంలో తన కండిషన్ ను చెప్పిన రేవంత్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవికి కూడా కృతజ్ఞతలు తెలిపారు. డ్రగ్ నియంత్రణ, సైబర్ క్రైమ్ నియంత్రణ విషయంలో మెగాస్టార్ చిరంజీవి వీడియో ఫుటేజ్ లు చేయడాన్ని రేవంత్ రెడ్డి అభినందించారు. సినీ ఇండస్ట్రీ నుంచి ప్రతి ఒక్కరూ సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఈ సమస్యలపై రియాక్ట్ అవ్వాలని సూచించారు.