HomeTelugu Big Storiesతెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా కేసులు

తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా కేసులు

7 25
తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కరోనా పాజిటివ్ కేసులు క్రమేణా పెరుగుతున్నాయి. ఓ వైపు రెండు రాష్ట్రాల సీఎంలు కరోనా కట్టడికి తీవ్రమైన చర్యలు చేపడుతున్నారు. దీనిలో భాగంగానే వైఎస్ జగన్ సర్కార్ స్పెయిన్‌ నుంచి ప్రత్యేక మాస్కులు తెప్పించింది. ఏపీలోని కరోనా వ్యాధి సోకిన వారికోసం 20 వేల ప్రత్యేక మాస్కులను స్పెయిన్ నుంచి కొనుగోలు చేసింది ఏపీ ప్రభుత్వం.

క్వారంటైన్‌లో ఉన్న కరోనా పేషెంట్లకు ఈ ప్రత్యేక మాస్కులు ఇవ్వనున్నారు. స్పెయిన్ లో తయారు చేసిన అధునాతన మాస్కులను ఏపి ఆరోగ్య కార్పొరేషన్ కొనుగోలు చేసింది. ఇప్పటి వరకు ఏపీలో 12 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. ఏపీలో ఇప్పటివరకు 385 మందికి కరోనా వైరస్‌ పరీక్షలు నిర్వహించినట్లు డిప్యూటీ సీఎం ఆళ్లనాని తెలిపారు. వారిలో 317 మందికి నెగిటివ్‌ వచ్చిందని, 55 మంది రిపోర్ట్స్‌ రావాల్సి ఉందని అన్నారు. అనుమానిత లక్షణాలున్న వారందరినీ క్వారంటైన్‌లో ఉంచామని తెలిపారు. కృష్ణా జిల్లాలో 2,540 మంది విదేశాల నుంచి వచ్చినవారిని గుర్తించామని వెల్లడించారు.

విజయవాడ జీజీహెచ్‌ను కరోనా ప్రత్యేక ఆస్పత్రిగా ఏర్పాటు చేశామని మంత్రి ఆళ్లనాని తెలిపారు. ఇక్కడ కృష్ణా, గుంటూరు, ప.గో.జిల్లాలకు సంబంధించిన వారికి వైద్య సేవలు అందించనున్నట్లు పేర్కొన్నారు. కృష్ణా జిల్లాలోని కరోనా బాధితుల కోసం సిద్ధార్ధ కాలేజీలో ప్రత్యేక ఆస్పత్రి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సిద్ధార్ధ మెడికల్‌ కాలేజీకి అనుబంధంగా స్క్రీనింగ్‌ ల్యాబ్‌ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కరోనా వ్యాపించకుండా అన్ని ప్రాంతాల్లో రైతు బజార్లను వికేంద్రీకరించామని తెలిపారు.

తెలంగాణలో ఈ ఒక్కరోజు మరో 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో ఇప్పటి వరకు తెలంగాణలో 59 మందికి కరోన పాజిటివ్ గా నమోదైనట్లు తెలిపారు. అంతే కాకుండా మరో 20 వేల మంది క్వారంటైన్‌లో ఉన్నారని అన్నారు. లాక్‌డౌన్‌కు ప్రజలు సహకరిస్తున్నారని, లేకుంటే విస్ఫోటనం సంభవించేదని అన్నారు. ప్రజల నుంచి మరింత సహకారం కావాలని కెసిఆర్ అన్నారు.

ఐసోలేషన్‌ వార్డుల్లో 11వేల మందికి చికిత్స అందేలా ఏర్పాట్లు చేశామని సీఎం కేసీఆర్ తెలిపారు. 1400 ఐసీయూ బెడ్స్‌ సిద్ధం చేశామని, 60వేల మందికి వైద్య సేవలు అందించేలా ఏర్పాట్లు చేశాని అన్నారు. పదవీ విరమణ చేసిన వైద్యులు, మెడికల్‌ సిబ్బంది సేవలను వినియోగించుకుంటామని తెలిపారు. యుద్ధం చేసే సమయంలో నిర్లక్ష్యం, అలసత్వం పనికిరాదని వైద్యులు, అధికారులు, పోలీసు సిబ్బందికి ప్రజలు సహకరించాని కేసీఆర్‌ కోరారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నవాళ్లందరికీ ఆహారం, వసతి ఏర్పాటు చేస్తామని ఎక్కడివాళ్లు అక్కడే ఉండాలని కేసీఆర్ అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో హాస్టళ్లు మూసివేయరని హామీ ఇచ్చారు. ఇతర రాష్ట్రాల ఉద్యోగులు, విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu