దేశంలోని పేదలకోసం కేంద్రం భారీ ప్యాకేజ్


కరోనా మహమ్మారితో ప్రపంచ దేశాలు సైతం వణికిపోతున్నాయి. ఈమహమ్మారిని అరికట్టేందుకు అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే అనేక దేశాల్లో లాక్‌డౌన్ ప్రకటించాయి. ఈ నేపథ్యంలోనే దేశంలోనూ లాక్‌డౌన్‌ ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోదీ. కరోనా విపత్తు నుంచి కోలుకునేందుకు కేంద్రం 1.70 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దీనికి సంబంధించి ప్రకటన విడుదల చేశారు. లాక్‌డౌన్ నేపథ్యంలో కార్మికులు ఆకలితో అలమటించకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

వలస కార్మికులు, గ్రామీణ, పట్టణ పేదలను ఆదుకునేందుకు ఈ ప్యాకేజీ రూపొందించినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. ముఖ్యంగా పేద కార్మికులను ఆదుకోవడమే లక్ష్యంగా దృష్టిపెట్టినట్లు తెలిపారు. పారిశుధ్య కార్మికులు, ఆశా వర్కర్లు, పారా మెడికల్ సిబ్బంది, వైద్యులు, నర్సులు వీరందరికి రూ. 50 లక్షల బీమా కల్పిస్తున్నట్లు ప్రకటించారు. పేదలకు అందించే ఈ ప్యాకేజీలో ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున 3 నెలల పాటు అందించనున్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ పథకం కింద సహాయం అందించనున్నట్లు తెలిపారు. వచ్చే 3 నెలల వరకు పేదలకు 5 కిలోల బియ్యం లేదా 5 కిలోల గోధుమలు, కిలో కంది పప్పును ఉచితంగా అందించబోతున్నట్టు ప్రకటించింది. అదే విధంగా రైతులకు నెలకు రూ. 2 వేల చొప్పున వారి అకౌంట్లలోకి డబ్బులు వేయబోతున్నట్టు ప్రకటించారు.

దేశంలోని 20 కోట్ల మంది మహిళలకు నెలకు రూ.500 చొప్పున మూడు నెలల పాటు ఇవ్వబోతున్నట్టు చెప్పారు. మహిళా ఉజ్వల్ యోజన కింద నెలకు ఒకటి చొప్పున 3 గ్యాస్ సిలెండర్లు ఉచితంగా ఇవ్వనున్నట్టు ప్రకటించారు. 20 లక్షల వైద్య బృందాలకు రూ. 50 లక్షల ఇన్సూరెన్స్ కల్పిస్తున్నట్టు తెలిపారు. 60 ఏళ్ళు పైబడిన వితంతువులు, దివ్యాంగులకు అదనంగా వెయ్యి ఎక్స్ గ్రేషియా ఇవ్వబోతున్నట్టు ప్రకటించారు.