HomeTelugu Trendingఅమెరికాలో కరోనా మరణమృదంగం

అమెరికాలో కరోనా మరణమృదంగం

3a 2
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విజృంభిస్తోంది. ఇప్పటికే అమెరికా వ్యాప్తంగా 68,472 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 1,032మంది మరణించారు. కేవలం బుధవారం ఒక్కరోజే 223 కరోనా మరణాలు నమోదయ్యాయి. అంతకు ముందు మంగళవారం 164 మంది మరణించారు. నాలుగు రోజుల క్రితం 300 మరణాలు ఉండగా ప్రస్తుతం వెయ్యికి పైగా దాటడం ఆందోళన కలిగిస్తోంది. చైనా, ఇటలీ తర్వాత అత్యధిక కొవిడ్‌-19 కేసులు అమెరికాలోనే నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించారు. తాజాగా కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు ఈ పరిస్థితిని భారీ విపత్తుగా ప్రకటిస్తున్నాయి. న్యూయార్క్‌, కాలిఫోర్నియా, వాషింగ్టన్‌, లోవా, లూసియానా, ఉత్తర కరోలినా, టెక్సాస్, ఫ్లోరిడా రాష్ట్రాలు కరోనాను భారీ విపత్తుగా ప్రకటించగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వీటికి ఆమోదముద్ర వేశారు.

న్యూయార్క్‌ నగరంలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. ఈ ఒక్క నగరంలోనే ఈ వైరస్‌ కారణంగా 285మంది చనిపోగా వైరస్‌ సోకిన వారిసంఖ్య 30 వేలకు చేరింది. న్యూయార్క్‌ సమీప రాష్ట్రాలైన న్యూజెర్సీలో 62 మంది కాలిఫోర్నియాలో 65 మరణాలు సంభవించాయి. వాషింగ్టన్‌, మిచిగాన్‌ రాష్ట్రాల్లో కూడా దీని తీవ్రత అధికంగా ఉంది. ఈ విపత్కర సమయంలో కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు తాము శాయశక్తులా ప్రయత్నిస్తున్నామని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ శ్వేతసౌధంలో విలేకరులతో పేర్కొన్నారు. దీనికోసం అధికారులు దేశవ్యాపంగా పెద్దఎత్తున వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు. అమెరికా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్న కరోనా వైరస్‌తో దేశవ్యాప్తంగా ప్రస్తుతం దాదాపు 10 కోట్ల మంది లాక్‌డౌన్‌లో ఉన్నారని ఆయన వెల్లడించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu