హీరో సూర్యకు క్రికెటర్ రైనా సూటి ప్రశ్న..!


ప్రముఖ నటుడు సూర్యను.. టీమిండియా క్రికెటర్‌ సురేశ్‌ రైనా ఓ ప్రశ్న అడిగారు. సూర్య నటించిన ఎన్జీకే సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా సోమవారం ఆయన అభిమానులతో చిట్‌చాట్‌లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో రైనా కూడా సరదాగా ట్విటర్‌ వేదికగా సూర్యను ఓ ప్రశ్న అడిగారు. చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టులో మీకు ఏ క్రికెటర్ అంటే ఇష్టం?ఎందుకు? అని ప్రశ్నించారు. ఇందుకు సూర్య సమాధానంగా.. నాతో మాట్లాడటానికి మీకు సమయం కుదిరింది. దీనిని నేను నమ్మలేకపోతున్నాను. మీ అమ్మాయి గ్రేసియాతో పాటు ఇంట్లో వారందరినీ అడిగానని చెప్పండి.

నాకు సూపర్‌ కింగ్స్‌ జట్టులో మహేంద్రసింగ్‌ ధోనీ అంటే ఇష్టం. మీరు ఈ జట్టు గురించి ప్రశ్న అడిగారని నేను ఆయన పేరును చెప్పలేదు. సూపర్‌కింగ్స్‌ బృందంలో నేను కలిసిన తొలి ఆటగాడు ధోనీ. ఆ తర్వాత మిమ్మల్ని కలిశాను. మీరే వచ్చి నాకు హలో చెప్పినప్పుడు చాలా ముచ్చటేసింది. మనమిద్దరం కలిసి దిగిన ఫొటోను నేను భద్రంగా దాచుకుంటాను. నేను ఎప్పటికీ సీఎస్‌కే అభిమానిని అని వెల్లడించారు. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో ఒక్క పరుగు తేడాతో సూపర్‌ కింగ్స్‌ జట్టు కప్పును చేజార్చుకుంది. సూర్య నటించిన ఎన్జీకే చిత్రానికి సెల్వరాఘవన్‌ దర్శకత్వం వహించారు. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, సాయి పల్లవి కథానాయికలుగా నటించారు. మే31న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.