కరోనా మహమ్మారి కారణంగా సినీ పరిశ్రమకు తీవ్ర నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. సినిమా షూటింగులు లేక పరిశ్రమలోని కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం షూటింగులకు అనుమతి ఇచ్చినప్పటికీ కరోనా విజృంభిస్తున్ననేపథ్యంలో ఎవరూ షూటింగ్‌లకు రాలేని పరిస్థితి. కష్టాల్లో ఉన్న కార్మికుల కోసం ఇప్పటికే పలువురు హీరోలు భారీగా విరాళాలు ప్రకటించారు. సినీ కార్మికులకు చేయూతగా హీరో సూర్య రూ.5 కోట్లు విరాళంగా ఇచ్చారు. సినీ పరిశ్రమ మనుగడకు ఎన్నో కుటుంబాలు పనిచేస్తున్నాయన సూర్య అన్నారు.
కరోనా కారణంగా ఆర్టిస్టులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. ప్రస్తుత పరిస్థుల వల్లే ఆకాశమే హద్దురా సినిమాను డిజిటల్ మీడియాకు విక్రయించినట్టు సూర్య తెలిపారు. దీనిని అభిమానులు అర్ధం చేసుకోవాలన్నారు. సూర్య నటించిన ‘ఆకాశమే హద్దురా’ సినిమాను ఇటీవల ఓటీటీ ప్లాట్‌ఫాంలో విక్రయించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాను సూర్య తన సొంత ప్రొడక్షన్ 2D ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిర్మించారు. ఇందులో టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు ప్రముఖ పాత్రలో నటించారు.