ప్రకాశం జిల్లాలో దండుపాళ్యం బ్యాచ్.. ప్రేమ జంటలే టార్గెట్..!


ప్రేమ జంటలే లక్ష్యంగా ప్రకాశం జిల్లాలో ఒంగోలు మండలం, గుండ్లకమ్మ ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లోనూ కొన్ని ముఠాలు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇంట్లో తెలియకుండా రహస్యంగా కలుసుకోవడానికి వచ్చిన ప్రేమ జంటలను టార్గెట్ చేస్తూ వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు, వారి దగ్గర నుంచి దొరికినంత డబ్బులు, నగలు దోచుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నా, ఫిర్యాదు చేసేందుకు ప్రేమికులు వెనుకాడుతున్నారు. కుటుంబం పరువు పోతోందని, ప్రియుడితో వెళ్లామని తెలిస్తే తల్లిదండ్రులు దండిస్తారనే భయంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ముందుకురావడం లేదు. ఇలా జరుగుతున్న విషయం తెలిసినా, లిఖిత పూర్వక ఫిర్యాదులు రాకపోవడంతో వీటిని పోలీసులు పెద్దగా పట్టించుకోవడం లేదు.

ప్రేమికుల వీక్‌నెస్‌ను అదునుగా తీసుకున్న బ్యాచ్ ఒకటి మూడురోజుల క్రితం జరిగిన ఒంగోలు సమీపంలో దారుణానికి పాల్పడింది. నాగులుప్పలపాడు మండలానికి చెందిన ఇద్దరు వివాహితులు ఏకాంతంగా పేర్నమిట్ట-మంగమూరు రోడ్డులోని ఓ జామాయిల్ తోటలో ఉండగా.. వారిని ముగ్గురు యవకులు వెంబడించారు. ఏకాంతంగా గడుపుతున్న సమయంలో వారిపై దాడిచేసి, యువకుడిని బెల్టుతో తీవ్రంగా కొట్టారు. తర్వాత అతని వద్ద నగదు దోచుకున్నారు. బెల్టుతో అతని కాళ్లు చేతులు కట్టేసి, మహిళ ఒంటి మీద ఉన్న బంగారాన్ని దోచుకున్నారు. ఈ ఘటన జరుగుతుండగానే… కట్లు విప్పుకున్న యువకుడు దగ్గరలోని మంగమూరు గ్రామంలోకి వెళ్లి తమను రక్షించాల్సిందిగా గ్రామస్థులను కోరాడు. గ్రామస్థులు సంఘటనా స్థలానికి చేరుకునేసరికి నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. గతంలో చీమకుర్తి ప్రాంతానికి చెందిన కొందరు ఓ గ్యాంగ్
ఏర్పడి.. నాగార్జున సాగర్ కాలువపై తిరుగుతూ జంటలను బెదిరించి డబ్బులు దోచుకోవడం, అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటనలు జరిగాయని స్థానికులు చెబుతున్నారు. దీంతో మంగమూరు ఘటనకు.. ఆ గ్యాంగ్ కి సంబంధం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.