HomeTelugu Newsవైసీపీ పాలనలో అభివృద్ధి ఆగిపోయింది: చంద్రబాబు

వైసీపీ పాలనలో అభివృద్ధి ఆగిపోయింది: చంద్రబాబు

10 16
టీడీపీ అధినేత చంద్రబాబు.. వైసీపీ ప్రభుత్వ పాలనలో అభివృద్ధి ఆగిపోయిందని విమర్శించారు. ఒకప్పుడు రాష్ట్రం ఎలా ఉంది.. ఈ 9 నెలల్లో ఎలా ఉందో ఆలోచించాలని ప్రజలకు ఆయన సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా టీడీపీ ప్రజాచైతన్య యాత్రను ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం మార్టూరులో చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలు, టీడీపీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఒక్క ఛాన్స్‌ ఇవ్వాలని వైసీపీకు ఓటు వేశారని.. ఇప్పుడు అనుభవిస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు. టీడీపీ నేతలు, కార్యకర్తలను శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు.

”రాష్ట్ర భవిష్యత్‌ను నాశనం చేస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. శనగలకు మద్దతు ధర ఇస్తామని చెప్పారు.. కొనే నాథుడు కరవైనా పట్టించుకోవడం లేదు. ఈ ప్రభుత్వానికి రైతుల ఆత్మహత్యలు పట్టడం లేదు. పేదవాడికి కడుపు నిండా తిండి కోసం అన్న క్యాంటీన్లు పెడితే వాటిని తీసేశారు. చీటికి మాటికి టీడీపీ కార్యకర్తలపై పోలీసులు కేసులు పెడుతున్నారు. నేనూ అలా చేసి ఉంటే జగన్‌ పాదయాత్ర చేసేవారా? రేషన్‌, పింఛన్‌.. అన్నింటిలో కోతలు వేసుకుంటూ వెళ్తున్నారు. నిరుద్యోగ భృతి.. ఉపకారవేతనాలూ ఇవ్వడం లేదు. రాష్ట్రం నుంచి రూ.1.80లక్షల కోట్ల పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోయాయి. రిలయన్స్‌, అదానీ, లూలూ సంస్థలు ఎందుకు పోయాయి? కియాను బెదిరిస్తే వాళ్లు కూడా పారిపోయే పరిస్థితి వచ్చింది. పెట్టుబడులు రాకుండా ఉద్యోగాలు లేకపోతే స్థానికులకు 75 శాతం రిజర్వేషన్లు ఎందుకు? 75 శాతం రిజర్వేషన్ల మూలంగా పక్క రాష్ట్రాలకు వెళితే సొంత రాష్ట్రానికే పొమ్మంటున్నారు”

అమరావతి, పోలవరాన్ని ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఎవరైనా మూడు రాజధానులు కావాలని అడిగారా? అమరావతిపై ఎందుకంత కక్ష? ఏ ఊర్లో అయినా ఒకే సామాజిక వర్గం ఉంటుందా? 29వేల మంది రైతులు రోడ్లపైకి వచ్చి పోరాడుతున్నారు. రైతులు ఆందోళన చేస్తుంటే సీఎం ఎందుకు స్పందించడం లేదు? అమ్మ ఒడి పథకం ఇద్దరు పిల్లలకు ఇస్తామని చెప్పి.. ఇప్పుడు ఒకరికే అంటున్నారు. జే ట్యాక్స్‌ కడితేనే మద్యం వస్తుంది.. లేకపోతే రాదు. నా జీవితం తెరిచిన పుస్తకం. నీతి, నిజాయతీతో ఉన్నా. ఒక పద్ధతి ప్రకారం రాజకీయం చేశా. నా కుటుంబం కోసం, నా మనుషుల కోసం ఎక్కడా తప్పు చేయలేదు. డబ్బుకు లొంగి.. కేసులకు భయపడితే ప్రజలకు భవిష్యత్తు ఉండదు. టీడీపీ నేతల భద్రతను తొలగిస్తున్నారు. నా భద్రతను కుదించే యత్నం చేస్తున్నారు. నా భద్రత తొలగించినా ఇబ్బంది లేదు.. నన్ను ప్రజలే కాపాడుకుంటారు” అని చంద్రబాబు అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu