వివాహ బంధంతో ఒక్కటైన దీపిక, రణ్‌వీర్‌!


బాలీవుడ్ ప్రేమపావురాలు దీపిక పదుకొణె, రణ్‌వీర్‌ సింగ్‌ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇటలీలోని లేక్‌ కోమోలో వీరి వివాహం ఈరోజు కొంకణి సంప్రదాయంలో అట్టహాసంగా జరిగింది. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన పెళ్లి తంతు సాయంత్రం 3 గంటలకు ముగిసినట్లు తెలుస్తోంది. వేడుక నిమిత్తం వరుడు రణ్‌వీర్‌ తన బృందంతో కలిసి సీప్లేన్‌లో మండపానికి వచ్చారట. ఇదే రోజున వీరిద్దరి నిశ్చితార్థ వేడుకను కూడా నిర్వహించారు. రణ్‌వీర్‌ తన మోకాలిపై కూర్చుని తనకు కాబోయే భార్య వేలికి ఉంగరం తొడుగుతున్నప్పుడు దీపిక ఉద్వేగానికి లోనయ్యారని బాలీవుడ్‌ వర్గాల సమాచారం. అప్పుడు రణ్‌వీర్‌ ఆమెను ప్రేమగా ఆలింగనం చేసుకుని బుజ్జగించారట.

పెళ్లి నిమిత్తం దీపిక ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ సవ్యసాచి డిజైన్‌ చేసిన చీరను ధరించినట్లు తెలుస్తోంది. లేక్‌ కోమో తీరంలో ఏర్పాటుచేసిన వివాహ విందు ఫొటోలు, పెళ్లిదుస్తుల్లో రణ్‌వీర్‌, దీపిక ఉన్న ఫొటోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పెళ్లి జరిగే ప్రాంతం వద్ద భారీ సెక్యూరిటీని విధించారు. వివాహానికి వచ్చే అతిథులు తప్పకుండా శుభలేఖలు తీసుకురావాలని, చేతికి రిస్ట్‌ బ్యాండ్స్‌ ధరించాలని నిబంధనలు విధించారు. గురువారం సింధి సంప్రదాయంలో మరోసారి దీపిక, రణ్‌వీర్‌ వివాహం జరుగుతుంది.

కాగా నవ దంపతులు దీపికా రణ్‌వీర్‌లపై సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షల వర్షం కురుస్తోంది. ‘ఎంత అందమైన, అద్భుతమైన జంట!! వీరిద్దరికి దిష్టి తీయండి! ప్రియమైన దీపికా రణ్‌వీర్‌ మీకు శుభాకాంక్షలు!! జీవిత కాలానికి సరిపడా ప్రేమ, సంతోషం మీ సొం‍తం కావాలి’ అంటూ దీప్‌వీర్‌ దంపతులకు బాలీవుడ్‌ దర్శక నిర్మాత కరణ్‌ జోహార్‌ పెళ్లి శుభాకాంక్షలు తెలిపాడు.