ఫ్లాప్ అయినా.. ఆమెనే ప్రిఫర్ చేశారు!

హాలీవుడ్ లో ‘ట్రిపుల్ ఎక్స్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన దీపికా పడుకొనేకి మొదటి సినిమాతోనే నిరాశ ఎదురైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో అక్కడ క్రేజ్ సంపాదించాలనుకున్న దీపికాకు చుక్కెదురైంది. తన బ్రాండింగ్ కోసం హాలీవుడ్ లో ఆమె ఖర్చు పెట్టిన ఖర్చులే ఆమెకు వచ్చిన పారితోషికం కంటే ఎక్కువ. అయితే ఆ సినిమా సమయంలో ఆమె నటుడు విన్ డీజిల్ తో సన్నిహితంగా మెలగడం ఇప్పుడు ఆమెకు కలిసొస్తోంది. ఎందుకంటే ఈ సినిమాకు కొనసాగింపుగా వస్తోన్న చిత్రంలో కూడా దీపికానే హీరోయిన్ గా ఎంపికను చేశారు. 
ఈ విషయాన్ని చిత్రదర్శకుడు వెల్లడించాడు. నిజానికి డైరెక్టర్ కు ఆమెను తీసుకోవాలనే ఆలోచన లేకపోయినా.. నటుడు విన్ డీజిల్ మాత్రం దీపికాను తీసుకోవాల్సిందేనని పట్టు బట్టాడట. విన్ డీజిల్ లేకపోతే ఈ ఫ్రాంచైజీ ముందుకు కదలదు. కాబట్టి ఇక ఆయన ఇష్ట ప్రకారం దీపికాకే అవకాశం ఇచ్చారు. మరి ఈ చిత్రంతో అయినా.. దీపికా ఆశించిన సక్సెస్ వరిస్తుందో.. లేదో.. చూడాలి!