
కర్ణాటక సీఎం బీఎస్ యెడియూరప్ప తన కేబినెట్‌ను విస్తరించారు. తన కోటరీకి పెద్ద పీట వేశారు. ఆయన ప్రభుత్వంలో ముగ్గురు ఉప ముఖ్యమంత్రులు ఉండబోతున్నారు. వారిలో లక్ష్మణ్ సంగప్ప సవాది, గోవింద్ కర్జోల్, అశ్వంత్ నారాయణ్ ఉన్నారు. అయితే లక్ష్మణ్ సవాదికి ఈ పదవిని అప్పగించకూడదని బీజేపీ నేతల్లో కొందరు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సవది ఎమ్మెల్యే కాకపోవడం కూడా విమర్శలకు తావిస్తోంది. అయితే ఇటీవల కుప్పకూలిన జేడీఎస్ కాంగ్రెస్ ప్రభుత్వంలో చిచ్చుపెట్టడంతో సవాది కీలక పాత్ర పోషించారు కనుక ఆయనకు కీలక పదవి ఇవ్వాల్సి వచ్చిందని పార్టీ వర్గాలు అంటున్నాయి. కానీ కొందరు దీన్ని తప్పుబడుతున్నారు.
సవాది ఏకంగా అసెంబ్లీలోనే పోర్న్ చూశారని, అలాంటి వ్యక్తిని గౌరవప్రద పదవి అప్పగించడం వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని పార్టీ ఎమ్మెల్యే రేణుకాచార్య బహిరంగంగానే విమర్శిస్తున్నారు. యెడియూరప్పకు రేణుకాచార్య కూడా సన్నిహితుడే కావడం గమనార్హం. 2012లో సవాదితోపాటు మరో మంత్రి, ఒక ఎమ్మెల్యే తమ సెల్ ఫోన్లలో అశ్లీల వీడియోలు చూస్తు కెమెరాలకు అడ్డంగా చిక్కగారు. దీంతో నాటి బీజేపీ ప్రభుత్వం వివరణ ఇచ్చుకోలేక తిప్పలు పడింది. అయితే తాము పోర్న్ చూడలేదని, రేవ్ పార్టీ వంటి అంశాల గురించి తెలుసుకోడానికి వీడియోలు చూశామని వారు చెప్పుకొచ్చారు. అయినా విమర్శలు ఆగకపోవడంతో రాజీనామాలు చేశారు.













