తారక్‌ ఇంటి వద్ద అభిమానుల సందడి


యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ మంగళవారం తన 36వ పుట్టినరోజును జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా సోమవారం రాత్రి ఆయన నివాసం ముందు భారీగా అభిమానులు గుమిగూడారు. ఈ సందర్భంగా అభిమానులు చేసిన నినాదాలు ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారాయి. తారక్‌ ఇంటి ముందు చేరిన ఫ్యాన్స్‌ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడంతోపాటు.. జై ఎన్టీఆర్‌ సీఎం ఎన్టీఆర్‌ అంటూ కేకలు పెట్టారు. దీన్ని బట్టి అభిమానులు తారక్‌ను రాజకీయ నాయకుడిగా చూడాలి అనుకుంటున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

మరోపక్క మంగళవారం ఉదయం తారక్‌ ఇంటి డాబా నుంచి అభిమానులకు అభివాదం చేశారు. దీంతోపాటు సోషల్‌మీడియాలో తనకు శుభాకాంక్షలు చెప్పిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. తనపై చూపిస్తున్న ప్రేమ, అభిమానానికి ఆనందం వ్యక్తం చేశారు. అంతేకాదు తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు తారక్‌ పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఫొటోలు, వీడియోలను సోషల్‌మీడియాలో షేర్‌ చేస్తున్నారు.