రేపే సార్వత్రిక ఎన్నికల ఫలితాలు.. మధ్యాహ్నం లోపే ట్రెండ్స్

ఓట్ల లెక్కింపు కోసం సర్వం సిద్ధం చేశామని తెలిపారు ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది. తొలుత పోస్టల్‌ బ్యాలెట్లు, సర్వీస్‌ ఓట్లు లెక్కించి ఉదయం 8.30 గంటలకు ఈవీఎంల లెక్కింపు చేపడతామని చెప్పారు. మధ్యాహ్నం 12 గంటల లోపు ఫలితాల ట్రెండ్స్‌ తెలిసిపోతాయన్నారు. వీవీప్యాట్‌ స్లిప్పుల లెక్కింపు తర్వాతే ఫలితం ప్రకటిస్తామని ద్వివేది స్పష్టంచేశారు. ఈవీఎంలో సాంకేతిక సమస్యలు ఉంటే వీవీప్యాట్ స్లిప్పుల్ని లెక్కిస్తామని స్పష్టంచేశారు.

బుధవారం ఆయన ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై మీడియాతో మాట్లాడుతూ.. 36 కౌంటింగ్‌ కేంద్రాల్లో సుమారు 350 లెక్కింపు హాళ్లు పెట్టాం. ప్రతి అసెంబ్లీ స్థానానికి ఒక పరిశీలకుడు, పార్లమెంట్‌ స్థానానికి మరో పరిశీలకుడు ఉంటారు. రిటర్నింగ్ అధికారులు, పరిశీలకుల ఆధ్వర్యంలో లెక్కింపు జరుగుతుంది. ఇప్పటికే లెక్కింపునకు ఏర్పాట్లన్నీపూర్తయ్యాయి. రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు సరళిని పరిశీలించేందుకు ఈసీఐ నుంచి ఇద్దరు పరిశీలకులు రాష్ట్రానికి వచ్చారు. వాళ్లు ఎప్పటికప్పుడు పలు సూచనలు, సలహాలు ఇస్తున్నారని చెప్పారు.