తొలి దరఖాస్తు చేసుకున్న పవన్‌

వచ్చే సాధారణ ఎన్నికల్లో శాసనసభ, లోక్‌సభ స్థానాల నుంచి అభ్యర్థులను పోటీకి దింపే అంశంపై ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ) మంగళవారం చర్చించింది. జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ అధ్యక్షతన విజయవాడలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ కమిటీ సమావేశమై అభ్యర్థుల ఎంపిక వ్యవహారం ఎలా ముందుకు తీసుకెళ్లాలో చర్చించింది. వడపోత కమిటీకి మార్గదర్శకాలిచ్చింది. ఏయే అంశాల ఆధారంగా అభ్యర్థులను ఎలా వడబోయాలో సమావేశంలో చర్చించి ఖరారు చేశారు. 2009 ప్రజారాజ్యం పార్టీ అనుభవాల దృష్ట్యా ఎక్కడా డబ్బు అనే అంశానికి ప్రాధాన్యం లేకుండా నిబద్ధత, కష్టపడి పని చేసే తత్వం ఆధారంగానే అభ్యర్థిత్వాలు ఖరారు చేయాలని పవన్‌కల్యాణ్‌ చెప్పారు. ఈ విషయంలో పార్టీ అధినేతగా తనకు కూడా మినహాయింపు లేదంటూ పవన్‌కల్యాణ్‌ తన బయోడేటాను వడపోత కమిటీకి తొలి దరఖాస్తుగా సమర్పించారు. సమావేశంలో పార్టీ ముఖ్య నాయకులు నాదెండ్ల మనోహర్‌, మాదాసు గంగాధరం, రావెల కిషోర్‌బాబు, తోట చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి చూపే అభ్యర్థులు వారి బయోడేటాలను మాదాసు గంగాధరం ఆధ్వర్యంలోని వడపోత కమిటీకి సమర్పించాలని పవన్‌కల్యాణ్‌ సూచించారు. అభ్యర్థులు కూడా పక్క మార్గాలకు వెళ్లకుండా తాము నియమించిన ఐదుగురు సభ్యుల కమిటీకి తప్ప వేరెవరికీ దరఖాస్తులు సమర్పించవద్దన్నారు. వడపోత కమిటీ నాయకుడు మాదాసు గంగాధరం మాట్లాడుతూ పార్టీ నాయకుడు తమపై పెట్టిన బాధ్యతను మార్గదర్శకాలకు అనుగుణంగా పూర్తి చేస్తామని చెప్పారు.

హైదరాబాద్‌లోని అమెరికా కాన్సుల్‌ జనరల్‌ కేథరిన్‌ బి హడ్డా మంగళవారం జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను కలిశారు. విజయవాడలోని ఆయన నివాసంలో ఆమె మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడారు. పార్టీ నాయకులు నాదెండ్ల మనోహర్‌ కూడా ఉన్నారు.

విశాఖపట్నం-1 మాజీ ఎమ్మెల్యే అల్లు భానుమతి మంగళవారం జనసేన పార్టీలో చేరారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ ఆమెకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. 1985లో ఆమె శాసనసభకు ఎన్నికయ్యారు.