వారికి బిన్‌లాడెన్‌కు పట్టిన గతే పట్టాలి: రామ్ దేవ్‌ బాబా

జైషే మహ్మద్ అధినేత మసూద్‌ అజహర్‌, హఫీజ్ సయీద్‌ను భారత్‌కు తీసుకురావాలని, లేకపోతే ఒసామా బిన్‌లాడెన్‌కు పట్టిన గతే వారికి పట్టాలని యోగా గురువు రామ్ దేవ్‌ బాబా శుక్రవారం తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఇంతటి హేయమైన చర్యకు పాల్పడిన పాకిస్థాన్‌కు దీటుగా జవాబివ్వాలని కేంద్రాన్ని కోరారు. జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఆత్మాహుతి దాడిలో సుమారు 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే. ‘సరిహద్దు గుండా మన దేశంలోకి చొరబడుతున్న లేక ఇప్పటికే దేశంలో ఉన్న ఉగ్రవాదులను మట్టుబెట్టాలి. ముఖ్యంగా 2008లో ముంబయి దాడుల సూత్రధారి అయిన హఫీజ్‌ సయీద్, జైషే మహ్మద్ అధినేత మసూద్‌ అజహర్‌ను అంతమొందించాలి. వారెక్కడున్నా భారత్‌కు తీసుకురావాలి. లేకపోతే అల్‌ఖైదా అధినేత ఒసామా బిన్‌లాడెన్‌కు పట్టిన గతే వారికి పట్టాలి’ అని నొయిడాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన తీవ్రంగా మండిపడ్డారు. పాకిస్థాన్‌లోని అబోటాబాద్‌లో రహస్యంగా నివసిస్తోన్న ఒసామా బిన్‌లాడెన్‌ను అమెరికా దళాలు మట్టుపెట్టిన సంగతి తెలిసిందే.

‘పాకిస్థాన్‌ పరిణితి లేని, నిరక్షరాస్య దేశంగా ప్రవర్తిస్తోంది. భారత ప్రధాని దానికి తగిన బుద్ధి చెప్పాలి. దాడికి తగిన ప్రతీకారం తీర్చుకుంటామని చాలా మాటలు చెప్తాం. కానీ వాటి వల్ల ఏ ఉపయోగం లేదు. ప్రధాని దీనిపై తగిన చర్య తీసుకోవాలి. దేశం మొత్తం ఆయనకు మద్దతుగా నిలుస్తుంది. ఇది ఐక్యత, సమగ్రత, సార్వభౌమత్వానికి సంబంధించిన విషయం. ఎటువంటి చౌకబారు రాజకీయాలకు చోటు ఉండకూడదు. ఇరు దేశాల వద్ద అణ్వస్త్రాలున్నాయి. ఇది దానికి సంబంధించిన విషయం కాదు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలి. వారిని వేటాడి, అంతమొందించాలి. మీరు పాక్‌తో సత్సంబంధాలు కోరుకుంటున్నారు. అది ఎప్పటికీ సాధ్యం కాదు. ఎందుకంటే పాక్‌ వాటిని వ్యతిరేకిస్తుంది’ అని మండిపడ్డారు