HomeTelugu Newsహైదరాబాద్‌లో ఈదురు గాలుల బీభత్సం.. ఒకరు మృతి, పలువురికి గాయాలు

హైదరాబాద్‌లో ఈదురు గాలుల బీభత్సం.. ఒకరు మృతి, పలువురికి గాయాలు

15 4హైదరాబాద్‌ జంటనగరాల్లో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. నగరంలో ఉరుములు మెరుపులతో సుమారు గంటపాటు కురిసిన ఈ భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల రహదారులకు అడ్డంగా పదుల సంఖ్యలో చెట్లు విరిగిపడటంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది. వర్షం నీరు రోడ్లపైకి చేరడంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఈదురు గాలుల ధాటికి ఎల్బీస్టేడియంలో ఫ్లడ్‌ లైట్‌ టవర్‌ కూలిపోయింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా, మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని ఆస్పత్రికి తరలించారు. మృతుడిని జీఎస్టీ ఉద్యోగి సుబ్రహ్మణ్యంగా గుర్తించారు. ఈ ఘటనలో నాలుగు కార్లు సైతం ధ్వంసమైనట్టు సమాచారం. ఘటనా స్థలాన్ని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దాన కిశోర్‌ పరిశీలించారు. కూకట్‌పల్లి, గాంధీనగర్‌, వెంగళరావు పార్కు సమీపంలోని పలు ప్రాంతాల్లో చెట్లు కూలి పలువురికి గాయాలయ్యాయి. అలాగే, పలు చోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడటంతో కార్లు ధ్వంసమయ్యాయి. లక్డికాపూల్‌, మాసాబ్‌ట్యాంక్‌ వద్ద హోర్డింగ్‌లు కూలడంతో ట్రాఫిక్‌ స్తంభించింది.

బేగంబజార్, కోఠి, సుల్తాన్‌ బజార్‌, అబిడ్స్, నాంపల్లి, బషీర్ బాగ్, లిబర్టీ, హిమాయత్ నగర్, లక్డికాపూల్‌, నేరేడ్‌మెట్‌, న్యూబోయిన్‌పల్లి, నాచారం, మల్లాపూర్‌ హబ్సిగూడ, ఓయూ క్యాంపస్‌, తార్నాక, లాలాపేట్‌, సికింద్రాబాద్‌, అడ్డగుట్ట, మారేడ్‌పల్లి, హెచ్‌బీ కాలనీ, ముషీరాబాద్‌, బేగంపేట, కుత్బుల్లాపూర్‌, చింతల్‌, కొంపల్లి, జీడిమెట్ల, మల్కాజ్‌గిరి, వనస్థలిపురం, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ కాలనీ, ఆల్విన్‌కాలనీ, బీహెచ్‌ఈఎల్‌, పటాన్‌చెరు, ఇస్నాపూర్‌ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. బషీర్‌బాగ్‌లో ఓ హోర్డింగ్‌ కూలిపోయింది. పాతబస్తీలో ఈదురు గాలులతో కూడిన వర్షంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. తార్నాక, ఓల్డ్‌ అల్వాల్‌, సికింద్రాబాద్‌ మిలటరీ ఆస్పత్రుల్లో వృక్షాలు కూలాయి. కూలిన చెట్లను జీహెచ్‌ఎంసీ ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు తొలగిస్తున్నాయి.

హైదరాబాద్‌కు ఈదురు గాలులతో కూడిన భారీ వర్ష సూచన ఉండటంతో జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కూలిన చెట్లను వెంటనే తొలగించి ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చూడాలని సూచించారు. అత్యవసర బృందాలు, ఇంజినీర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎస్‌ఆర్‌డీపీ పనులు జరిగే ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu