నేను మీ నాన్నతో కలిసి ఇలాంటి ఫొటోనే దిగా: మంచు లక్ష్మి ట్వీట్‌

నటి మంచు లక్ష్మి మెగా కుటుంబంతో తన బంధాన్ని గుర్తు చేసుకున్నారు. హీరో రామ్‌చరణ్‌తో కలిసి తన కుమార్తె దిగిన ఫొటోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ఇలాగే చిన్నతనంలో తను కూడా మెగాస్టార్‌ చిరంజీవితో ఫొటో దిగినట్లు చెప్పారు. ‘చరణ్‌, పాప కలిసి ఉన్న ఈ ఫొటో నాకు పాత రోజుల్ని గుర్తు తెస్తోంది. చరణ్‌.. నేను మీ నాన్నతో కలిసి ఇలాంటి ఫొటోనే దిగా. జీవితం మళ్లీ మొదలైన చోటుకే వచ్చిన భావన కలుగుతోంది. మనది ఎంతో అద్భుతమైన ప్రయాణం. ఇలా మన స్నేహం మరిన్ని సంవత్సరాలు కొనసాగాలి. నీకు (చరణ్‌కు) పిల్లలు పుట్టిన తర్వాత యాపిల్‌ (మంచు లక్ష్మి కుమార్తె) వాళ్లకి పెద్ద అక్కగా ఉండే రోజు కోసం ఎదురుచూస్తున్నా (నవ్వుతూ). ఇన్‌స్టాగ్రామ్‌కు స్వాగతం చరణ్‌’ అని పోస్ట్‌ చేశారు. దీన్ని చూసిన ఉపాసన కామెంట్‌ చేశారు. ‘దిస్‌ ఈజ్‌ సో క్యూట్‌’ అని పోస్ట్ చేశారు.

చరణ్‌ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను తెరిచిన సంగతి తెలిసిందే. అభిమానులకు మరింత చేరువగా ఉండాలనే ఉద్దేశంతో ఆయన ఇన్‌స్టా తెరిచారు. శుక్రవారం తొలి పోస్ట్‌ చేశారు. బాల్యంలో, ఇప్పుడు తన తల్లి సురేఖతో దిగిన ఫొటోలను షేర్‌ చేశారు. చెర్రీ ఫాలోవర్స్‌ సంఖ్య 5 లక్షలకు చేరింది.