అబద్ధపు, వెన్నుపోటుకు నిజమైన అభిమానులారా.. మీ కన్నీళ్లకి నేను బాధ్యుడిని కాదు: వర్మ

ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ.. ‘మీ కన్నీళ్లకి నేను బాధ్యుడిని కాదు’ అంటున్నారు . ఆయన తెరకెక్కిస్తున్న సినిమా ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’. ఎన్టీఆర్‌, లక్ష్మీ పార్వతి జీవితం ఆధారంగా ఈ సినిమాను తీస్తున్నట్లు వర్మ తెలిపారు. ఇందులో నిజాల్ని చూపించబోతున్నట్లు కూడా ఆయన వెల్లడించారు. కాగా గురువారం ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నారు. ఉదయం 9.27 గంటలకు ప్రచార చిత్రాన్ని విడుదల చేయబోతున్న నేపథ్యంలో వర్మ బుధవారం ఓ ట్వీట్‌ చేశారు.

‘ఎన్టీఆర్ అబద్ధపు అభిమానులారా, వెన్నుపోటుకు నిజమైన అభిమానులారా, రేపు పొద్దున్నే మీ ఇళ్ల దగ్గరలో ఉన్న గుళ్లలో ఆంజనేయస్వామికి ఆకు పూజ చేసి రెడీగా ఉండండి. ఉదయం 9:27 గంటల కల్లా మీ ముందు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్‌ ప్రత్యక్షం కాబోతోంది. మీ కన్నీళ్లకి నేను బాధ్యుడిని కాదు’ అంటూ వీక్షకుడ్ని భావోద్వేగానికి గురి చేస్తానని వర్మ చెప్పారు.

ఈ సినిమాలో ఎన్టీఆర్‌ పాత్రను పశ్చిమ గోదావరికి చెందిన రంగస్థల నటుడు ఒకరు పోషిస్తున్నారు. ఆయన పేరును వర్మ వెల్లడించలేదు. లక్ష్మీ పార్వతిగా కన్నడ నటి యజ్ఞ శెట్టి నటిస్తున్నారు. కల్యాణి‌ మాలిక్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన మ్యూజిక్‌ రికార్డింగ్‌ పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 22న ఈ సినిమా థియేట్రికల్‌ ట్రైలర్‌ విడుదల కాబోతున్నట్లు వర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే.