HomeTelugu Big Storiesబిగ్‌బాస్‌లో అందుకే అడుగుపెట్టలేదు: అనసూయ

బిగ్‌బాస్‌లో అందుకే అడుగుపెట్టలేదు: అనసూయ

13 2

ప్రముఖ యాంకర్‌, నటి అనసూయ మంచి కథలు దొరకాలే కానీ నానమ్మ పాత్రల్లో నటించడానికి కూడా సిద్ధమేనని అంటున్నారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘కథనం’. ఈ చిత్రానికి రాజేష్‌ నాదెండ్ల దర్శకత్వం వహించారు. శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో అనసూయ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె పంచుకున్న ముచ్చట్లివి.

ఈ సినిమాలో నేను అను అనే అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా కనిపిస్తాను. దర్శకురాలిగా నిలదొక్కుకునేందుకు సొంతంగా కథలు రాసుకోని అవకాశాల కోసం ప్రయత్నిస్తుంటా. ఈ క్రమంలో అను రాసుకున్న కథ నచ్చి దర్శకత్వం చేసే ఛాన్స్‌ వస్తుంది. అది ఓ మర్డర్‌ మిస్టరీ నేపథ్యంతో రాసుకున్న కథ. కానీ, ఆ కథలో రాసుకున్నట్లుగానే ఆమె నిజ జీవితంలో కొన్ని హత్యలు జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో ఆమె అనుకోని చిక్కుల్లో చిక్కుకుంటుంది. మరి వాటి నుంచి ఆమె ఎలా బయటపడింది? అన్నది మిగతా కథాంశం. టైటిల్‌కు తగ్గట్లుగానే కథనం చాలా ఆసక్తికరంగా సాగుతుంది. దర్శకుడిగా రాజేష్‌కు ఇది తొలి చిత్రమైనా ఎంతో జాగ్రత్తగా, చక్కగా తెరకెక్కించారు.

నాకు నా కుటుంబం అంటే చాలా ఇష్టం. వాళ్లను ఒక్కరోజు కూడా వదిలి ఉండలేను. సెట్స్‌లో ఉన్నా రోజులో ఒక్కసారైనా పిల్లలతో వీడియో కాల్‌ మాట్లాడుతుంటా. అందుకే బిగ్‌బాస్‌ హౌస్‌లో అడుగుపెట్టేందుకు ఇష్టపడలేదు.

నన్ను నేను క్రౌడ్‌పుల్లర్‌ అని ఎప్పుడూ అనుకోలేదు. ‘క్షణం’లో పాత్ర ఇచ్చేటప్పుడు కూడా నా ఇమేజ్‌ ఏంటి? మీరు నాకిస్తున్న పాత్రేంటి? అని అడిగా కానీ, వాళ్లు మాకు నీ మీద నమ్మకం ఉంది అన్నారు. ‘రంగస్థలం’ సమయంలోనూ నా పాత్రకు అంత ప్రాధాన్యముందని అనుకోలేదు. నాకిచ్చిన పాత్రను వాళ్లు చెప్పినట్లుగా చేసుకు వెళ్లిపోయానంతే. తర్వాత దాన్ని వారెలా వాడుకుంటారనేది పట్టించుకోను. ఇక బుల్లితెరకు వెండితెరకు మధ్య నాకు పెద్ద వ్యత్యాసం కూడా కనిపించదు. ఇంకా చెప్పాలంటే బుల్లితెరే నాకు చాలా పెద్దదిగా కనిపిస్తుంది. అక్కడ మాత్రమే నేను నేనులా కనిపిస్తుంటా. వెండితెరపైకి వచ్చే సరికి పాత్రకు తగ్గట్లుగా నటిస్తుంటా. కథానాయికగా ఓ సినిమా బాధ్యతను భుజానికెత్తుకోవడం వెనకున్న ఒత్తిడి ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. ఒకప్పుడు ఎవరైనా సినిమా విడుదలకు ముందు నాకు నిద్ర పట్టట్లేదు అంటే నమ్మేదాన్ని కాదు. ఇప్పుడా ఒత్తిడి నాకు తెలుస్తోంది.

నేను కెమెరా ముందుకొచ్చి అప్పుడే పదేళ్లు దాటిపోయింది. ఇన్నేళ్ల ప్రయాణంలో ఇంత స్థాయికి వస్తానని, ఇలా హీరోయిన్‌గా మారతానని ఎప్పుడూ అనుకోలేదు. ‘క్షణం’ నాకు నటిగా ధైర్యాన్నిచ్చింది. ఆ సినిమా తర్వాతే నేనెలాంటి కొత్త పాత్ర చేసినా ప్రేక్షకులు చూస్తారనే నమ్మకం ఏర్పడింది. నేను ఫలానా సినిమా చేస్తున్నానంటే అందులో ఏదో కొత్తదనం ఉంటుంది అన్న నమ్మకం వారిలోనూ కలుగుతోంది. నిజానికి నేను విన్న తొలి నాయికా ప్రాధాన్య చిత్రమిది కాదు. ‘రంగస్థలం’ నుంచి ఇప్పటి వరకు దాదాపు 13 కథలు విన్నా. ఏవీ ఆసక్తికరంగా అనిపించలేదు. కానీ, ‘కథనం’ కథ వినగానే నా మనసుకు బాగా నచ్చింది. ఈ పాత్రతో నటిగా నన్ను నేను మరింత నిరూపించుకోగలుగుతా అనిపించింది. ఈ పాత్రలో అనేక కోణాలు ఉంటాయి. ట్రైలర్‌లో వాటిలోని కొన్నింటిని మాత్రమే చూపించాం.

ఒకప్పుడు సామాజిక మాధ్యమాల్లో నాపై ఏమైనా విమర్శలు వస్తే చాలా సీరియస్‌గా తీసుకొనే దాన్ని. ‘వీళ్లంతా నన్ను ఇష్టడతున్నా అంటారు.. ఇప్పుడెందుకు ఇలా మాట్లాడుతున్నారు’ అనిపించేది. వాళ్లకు కచ్చితంగా సమాధానం చెప్పాలనిపించేది. ఇలా పట్టించుకోవడం నా తప్పే. కానీ, ఇప్పుడు ఓపిక వచ్చింది. కొన్ని అనవసర విషయాలకు దూరంగా ఉండటమే మేలు అనిపించింది. అందుకే కీ బోర్డు వారియర్స్‌కు దూరంగా ఉంటాను అని అనసూయ అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu