రజనీకాంత్‌, అజిత్‌లపై బాలీవుడ్‌ నటి సంచలన వ్యాఖ్యలు

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ఇషా కొప్పికర్‌.. హీరో అజిత్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఇషా.. ఓ తమిళ చిత్రంలో నటిస్తోంది. ఇందులో శివకార్తికేయన్‌ హీరో. ఈ సందర్భంగా ఇషా మీడియాతో మాట్లాడుతూ.. తన అభిమాన తమిళ నటుల గురించి చెప్పింది. తనకు అరవింద్‌ స్వామి అంటే చాలా ఇష్టమని, ఆయనతో కలిసి ఓ సినిమాలో నటించానని తెలిపింది. అజిత్‌ అన్నా తనకు చాలా ఇష్టమని పేర్కొంది.

ఇంతవరకు బాగానే ఉంది కానీ.. ఇషా అజిత్‌ గురించి ప్రస్తావిస్తూ.. ‘ఒకప్పుడు అజిత్‌ అంటే ఇష్టం. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నారో లేరో తెలీదు కానీ..’ అనేసింది. దాంతో ఆయన అభిమానులు ఇషాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ నటుడి పట్ల అంత అభిమానం ఉంటే ఆయన ఏ సినిమాలు చేస్తున్నారో.. ఏ స్థాయిలో ఉన్నారో కూడా తెలీదా అంటూ మండిపడుతున్నారు. అంతేకాదు.. శివకార్తికేయన్‌ను సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో పోల్చడం తలైవా అభిమానులను కోపోద్రిక్తుల్ని చేసింది. ‘నాకు శివకార్తికేయన్‌ను చూస్తుంటే రజనీకాంత్‌ యువకుడిగా ఉన్నప్పటి రోజులు గుర్తుకువస్తున్నాయి. ఒక్కోసారి ఆయన నటన చూసి షాకైపోతుంటాను’ అని తెలిపారు. దాంతో ఓ పక్క అజిత్‌ ఫ్యాన్స్‌.. మరోపక్క రజనీ ఫ్యాన్స్‌ ఇషాపై సోషల్‌మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు.1998లో ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన ‘చంద్రలేఖ’ సినిమాతో ఇషా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత ‘ప్రేమతో రా’, ‘కేశవ’ చిత్రాల్లోనూ నటించింది.