HomeTelugu Newsఉపాధ్యాయులకు మద్యం దుకాణాల వద్ద విధులా?: పవన్‌ కల్యాణ్‌

ఉపాధ్యాయులకు మద్యం దుకాణాల వద్ద విధులా?: పవన్‌ కల్యాణ్‌

8 4

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం చేపట్టిన మద్యం అమ్మకాల కోసం ఆయా దుకాణాల వద్ద ఉపాధ్యాయులను ఉంచడం శోచనీయమని ఆవేదన వ్యక్తంచేశారు. భావి భారత పౌరులకు విద్యాబుద్ధులు నేర్పించే గురువులకు ఇవేం విధులని ఆయన ప్రశ్నించారు. మంగళవారం ఆయన చిత్తూరు జిల్లా నేతలతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ.. కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకో, పేదలకు ఆహారం, నిత్యావసరాలు సరఫరా చేయడం వంటి వాటిని పర్యవేక్షించేందుకు ఉపాధ్యాయులు ఉపయోగించుకుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ప్రజలు ఆలయాలు, మసీదులు, చర్చీలకు వెళ్లకుండా.. పండుగలు చేసుకోకుండా నియబద్ధంగా ఉంటే.. ప్రభుత్వం మాత్రం మద్యం దుకాణాలు తెరవడం ద్వారా ఇంతకాలం పాటించిన లాక్‌డౌన్ నియమాలను, ఆ స్ఫూర్తిని మంటగలిపిందని పవన్‌ వ్యాఖ్యానించారు.

”సంపూర్ణ మద్య నిషేధం అని అధికారంలోకి వచ్చిన జగన్‌ ప్రభుత్వం కరోనా విపత్తు ఉంటే మద్యం అమ్మకాలను ఆపలేదా? శ్రీకాళహస్తిలాంటి చోట్ల ప్రజాప్రతినిధులు చేసిన ర్యాలీలు, బహిరంగ కార్యక్రమాలు వారెంత బాధ్యతారాహిత్యంతో ఉంటున్నారో అర్థమవుతోంది. కరోనాను కట్టడి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. రెడ్‌జోన్‌ నుంచి గ్రీన్‌ జోన్‌కు తీసుకురావడం ఎంతో కష్టమైన ప్రక్రియ అని నిపుణులు చెబున్నా అర్థం కావడంలేదు” అని ఆవేదన వ్యక్తంచేశారు.

”రాష్ట్రం అభివృద్ధిలో కాదు కరోనా కేసుల్లో ముందుకు వెళ్తోంది. జాతీయ స్థాయి నాయకులతో నిన్ననే రాష్ట్రంలో పరిస్థితిపై మాట్లాడా. మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా చేయడం, ఆ దుకాణాల దగ్గర జనం వేలంవెర్రిగా ఉన్నా కట్టడి చేయకుండా వదిలేయడం, ప్రజా ప్రతినిధులు ర్యాలీలు చేయడం గురించి వారు ప్రస్తావిస్తూ ‘ఆంధ్ర ప్రదేశ్ కరోనా ఫ్రెండ్లీ స్టేట్’ అని చాలా వ్యంగ్యంగా మాట్లాడారు. ఇక్కడ తీవ్రత చూసి తమిళనాడులోని వేలూరు జిల్లా అధికారులు మనవైపు చిత్తూరు జిల్లా సరిహద్దుల్లో గోడ కట్టేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కాదు కరోనా కేసుల్లో ముందుకు వెళ్తోంది. కరోనా నేపథ్యంలో ఉత్పన్నమైన పరిస్థితుల వల్ల చిరుద్యోగులు, చిరు వ్యాపారులు ఆర్థికంగా చితికిపోయారు. వారికి ఉపశమనం కలిగేలా ప్రభుత్వాలు దృష్టిపెట్టాలి” అని సూచించారు.

”మామిడి, టమోటా రైతులు తీవ్రంగా నష్టపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు, ప్రధానంగా ఉద్యాన పంటలు వేసినవారు ఎంతగా నష్టపోయారో సమగ్ర నివేదిక ద్వారా కేంద్రానికి తెలియజేస్తా. చేనేత కార్మికులు, చిన్నపాటి పరిశ్రమలు నిర్వహించేవారు ఆర్థికంగా దెబ్బ తిన్నారు. వీరందరిపై ప్రభుత్వం సానుభూతి చూపాలి. చిత్తూరు జిల్లాలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న విషయం నా దృష్టికి చేరింది. చిత్తూరు, మదనపల్లి ప్రాంతాల్లో రోజూ 2 వేల ట్యాంకర్లు సరఫరా చేయాల్సి ఉంటే కనీసం 800 కూడా సరఫరా చేయలేకపోతున్నారు. ఈ విషయంలో సంబంధిత అధికారులు తక్షణమే స్పందించాలి” అని పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!