మా ఇద్దరికీ లేనిపోని సంబంధాలు అంటగట్టారు:జయప్రద


అమర్‌సింగ్‌ను తాను గాడ్‌ఫాదర్‌గా భావిస్తుంటే కొందరు వ్యక్తులు మా ఇద్దరికీ లేనిపోని సంబంధాలు అంటగట్టారని సినీనటి, మాజీ ఎంపీ జయప్రద ఆవేదన వ్యక్తం చేశారు. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన సీనియర్‌ నాయకుడు, రాంపూర్‌ ఎమ్మెల్యే అజమ్‌ఖాన్‌ తనపై ఓ సారి యాసిడ్‌ దాడికి కూడా ప్రయత్నించాడని జయప్రద ఆరోపించారు. క్వీన్స్‌లైన్‌ లిటరేచర్‌ ఫెస్టివల్‌లో రచయిత రామ్‌ కమల్‌తో ఆమె సంభాషించారు. అందులో ఆమె మాట్లాడుతూ.. “ఒక మహిళగా రాష్ట్రంలో ఎన్నికల్లో పోటీ చేస్తున్నందుకు ఆజంఖాన్‌ లాంటి వ్యక్తుల నుంచి బెదిరింపులు ఎదుర్కొంటున్నాను. నా ప్రాణానికి గండం ఉంది. నేను ఇంటి నుంచి బయటికి వెళితే క్షేమంగా తిరిగి వస్తానో? లేదో కూడా మా అమ్మకు చెప్పలేకపోతున్నాను. ఏ ఒక్క రాజకీయ నాయకుడు నాకు మద్దతుగా నిలవలేదు. ములాయం సింగ్‌ కూడా ఈ విషయంలో ఎటువంటి సహాయం చేయలేదు” అంటూ జయప్రద ఆవేదన వ్యక్తం చేశారు.

సామాజిక మాధ్యమాల్లో మార్ఫింగ్‌ చేసిన తన చిత్రాల గురించి తెలిసి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని జయప్రద తెలిపారు. ఆ సమయంలో అమర్‌సింగ్‌ డయాలసిస్‌ చికిత్సలో ఉన్నారని, ఏం చేయాలో పాలుపోక మానసిక క్షోభ అనుభవించానని చెప్పారు. తాను ఆస్పత్రిపాలైన సందర్భంలో ఎవరూ అండగా నిలవలేదని, డయాలసిస్‌ చేయించుకుని తిరిగి వచ్చిన అనంతరం అమర్‌సింగ్‌ మాత్రమే చేయూతనిచ్చారని ఆమె వివరించారు. అలాంటి వ్యక్తిని తాను గాడ్‌ఫాదర్‌గా భావిస్తుంటే అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అమర్‌సింగ్‌కు రాఖీ కట్టినా ఇలాంటి ఆరోపణలు ఆపరని అందుకే వాటిని లెక్కచేయనని అన్నారు. ఈ పురుషాధిక్య ప్రపంచంలో రాజకీయాల్లో రాణించడం మహిళలకు నిజమైన యుద్ధంలాంటిదని ఆమె అభివర్ణించారు. పార్టీలో ఎంపీగా ఉన్న సమయంలోనూ అజమ్‌ ఖాన్‌ వేధించాడని ఆమె ఆరోపించారు. తనపై యాసిడ్‌ దాడికి యత్నించాడని, ఆ మరుసటి రోజు తానింకా బతికే ఉన్నానా? అనే అనుమానం కలిగేదని చెప్పారు. ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు క్షేమంగా తిరిగి వస్తానో? లేదోనని తన తల్లితో పలుమార్లు అన్నట్లు ఆమె గుర్తు చేసుకున్నారు. ఇటీవలే విడుదలైన సినిమా మణికర్ణిక పాత్రలో తనను తాను చూసుకున్నానని చెప్పారు. ప్రతి మహిళ అవసరాన్ని బట్టి ఓ దుర్గాదేవిగా మారాలని పిలుపునిచ్చారు.