నేనూ పొట్టి బట్టలు వేసుకున్నాను.. బాలసుబ్రహ్మణ్యం వ్యాఖ్యలపై జయసుధ స్పందన

సినిమా ఫంక్షన్లలలో వేదికలపై ఏ డ్రస్‌లు వేసుకోవాలో తెలియదా.. ఆఫర్స్ కోసం అంగాంగ ప్రదర్శన చేస్తూ భారతీయ సంస్తృతి సాంప్రదాయాలను భ్రష్టుపట్టిస్తున్నారంటూ ఆవేదనతో ఎస్. పి బాలసుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్‌లో దుమారం రేపుతున్నాయి. అయితే బాలసుబ్రహ్మణ్యం వ్యాఖ్యల్ని కొందరు సమర్ధిస్తుంటే.. నాగబాబు లాంటి నటులు ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు.

‘ఏ డ్రెస్ వేసుకోవాలో జడ్జ్ చేయడానికి మీరు ఎవరు? నిజంగా వాళ్లు పూర్తి నగ్నంగా రోడ్లపై తిరిగితే చర్యలు తీసుకోవడానికి చట్టాలు ఉన్నాయి. మగాళ్ల డ్రెస్‌ల గురించి వాళ్లు కండిషన్స్ పెట్టలేనప్పుడు వాళ్ల వస్త్రధారణ గురించి మీకెందుకు.. మతం ముసుగులో బూజుపట్టిన సాంప్రదాయాల నుండి ఇకనైనా బయటపడండి సార్.. అసలు విప్పితే మిమ్మల్నెవడు చూడమన్నాడు.. వాళ్ల తొడలు, బొడ్డు చూపిస్తుంటే తాపీగా చూసేసి ఇప్పుడు అలా ఉండాలి ఇలా అంటున్నారు. అసలు మీ మైండ్ వాటిపైకి ఎందుకు పోతుంది’ అంటూ ఎస్.పి బాల సుబ్రహ్మణ్యంపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు మెగా బ్రదర్ నాగబాబు.

ఇక ఆహా.. ఏం చెప్పారు నాగబాబు గారూ!! మీరు సూపర్ అంటూ జబర్దస్త్ యాంకర్ రష్మి లేటెస్ట్‌గా ఓ ట్వీట్ వదిలింది. దీంతో సరిపోయింది సంబరం.. వస్త్రధారణ గురించి నువ్వే చెప్పాలి అంటూ రష్మిని ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు కొంతమంది నెటిజన్లు.

ఇదిలా ఉంటే.. టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌‌గా మారిన ఈ వివాదంపై సీనియర్ హీరోయిన్, సహజనటి జయసుధ స్పందించారు. బాలసుబ్రహ్మణ్యం వ్యాఖ్యల్ని సమర్ధిస్తూ.. భారతీయ సాంప్రదాయాలను గౌరవించాలన్న ఆయన మాటల్లో తప్పేం ఉందన్నారు. ‘నేను కూడా చాలా సినిమాల్లో పొట్టి బట్టలు వేసుకున్నాను. కాని అవన్నీ పాత్ర పరిధి వరకే. కాని బయటకు వచ్చేటప్పుడు, సినిమా ఫంక్షన్లలలో చాలా పద్దతిగా వచ్చేవాళ్లం. కాని నేటి జనరేషన్ అమ్మాయిలు వేలాది మంది వచ్చే సినిమా ఫంక్షన్లకు సైతం పొట్టిబట్టలనే వేస్తున్నారు. ఇదే విషయాన్ని ఎస్. పి బాలు చెప్పారు. దీన్ని తప్పుపట్టవలసిన అవసరం లేదన్నారు జయసుధ.