రచయిత్రిగా శ్రద్దా శ్రీనాధ్!

జెర్సీ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి విజయాన్ని ఖాతాలో వేసుకుంది శ్రద్దా శ్రీనాధ్‌. శాండల్‌వుడ్‌కు చెందిన శ్రద్ధా అక్కడ యూటర్న్‌ చిత్రంతో వెలుగులోకి వచ్చింది. కోలీవుడ్‌లో ఇవన్‌ తందిరన్‌ చిత్రంతో పరిచయం అయ్యి అక్కడ కూడా సక్సెస్‌ అందుకుంది శ్రద్దా ఆ తర్వాత మాధవన్, విజయ్‌ సేతుపతితో కలిసి నటించిన విక్రమ్‌వేదా చిత్రంతో అనూహ్యంగా పాపులర్‌ అయ్యింది. సెలెక్టెడ్‌ చిత్రాల్లో నటిస్తూ సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకుంటూ పోతున్న శ్రద్ధా శ్రీనాధ్‌ తాజాగా అజిత్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న నేర్కొండిపార్వై చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది.

శ్రద్దా శ్రీనాధ్ నటించిన మరో తమిళ చిత్రం కే–13. అరుళ్‌నిధి హీరోగా నటించిన ఈ చిత్రానికి భరత్‌ నీలకంఠన్‌ దర్శకత్వం వహించారు. కే–13 అంటే ఒక అపార్ట్‌మెంట్‌ బ్లాక్‌ నెంబర్ అని.. ఓ సైకలాజికల్‌ మిస్టరీతో కూడిన థ్రిల్లర్‌ యాక్షన్‌ కథా చిత్రమని తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రద్దా శ్రీనాధ్ తెలిపింది. కథ వినకుండానే ఈ సినిమాకు ఓకే చెప్పేసిందట. తాను తమిళంలో నటించిన నాలుగో చిత్రం కే-13 విడుదల కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని అంటోంది. ఇందులో మలర్‌వేది అనే రచయిత్రి పాత్రలో నటించిన శ్రద్దా తన కెరీర్‌లో మంచి చిత్రంగా గుర్తుండిపోతుందని అంటోంది. మే 3వ విడుదలకు సిద్ధమైన ఈ చిత్రాన్ని ఎస్‌పీ సినిమాస్‌ సంస్థ నిర్మించింది.