చంద్రబాబు, జగన్‌లకు సవాల్‌..పవన్‌కు ఓపెన్ ఆఫర్ ఇచ్చిన కేఏ పాల్‌

ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు కేఏ పాల్ ఏపీ సీఎం చంద్రబాబు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఎవ్వరినీ వదలడంలేదు. ఏపీ సీఎం, ప్రతిపక్ష నేతకు సవాల్ విసిరిన పాల్.. జనసేన అధినేతకు మాత్రం ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. అనంతపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన… రాష్ట్రంలో సీఎం చంద్రబాబు ఓటమి ఖాయం… ఆయనది రాక్షస పాలన అని మండిపడ్డారు. 15 ఏళ్లలో చంద్రబాబు రాయలసీమకు ఏం చేశారు? అని ప్రశ్నించారు. టీడీపీ, వైసీపీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు.. తప్పితే చేసిందేమీలేదన్న కేఏ పాల్… తనతో చంద్రబాబు, జగన్ మూడు డిబెట్లకు వస్తే.. వారి నిజస్వరూపం బయటపెడుతా..! కుప్పం, పులివెందులలో తాను పోటీకి సిద్ధం.. చంద్రబాబు, జగన్ సిద్ధమా? అంటూ సవాల్ చేశారు.

తాను ఒంటరిగా పోటీ చేస్తే వంద సీట్లు గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు కేఏ పాల్… అమెరికాలో తాను ట్రంప్ నే గెలిపించా! నని.. తనకు తెలిసిన 2050 బిలియనీర్స్‌లో ఒక్కరైనా డబ్బు ఇవ్వరా? అంటూ ఎదురుప్రశ్నించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ఒంటరిగా వెళ్తే ఏమీ చేయలేరన్న పాల్.. ఎంతో ప్రజాదరణ ఉన్న చిరంజీవికే 18 సీట్లు వచ్చాయన్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌కు ఓపెన్ ఆఫర్ ఇచ్చారు కేఏ పాల్… పవన్ కల్యాణ్ తనతో వస్తే యువత బాధ్యతలు అప్పగిస్తానని ఆఫర్ చేశారు. ఢిల్లీలో కేజ్రీవాల్ తరహాలో తనను కూడా గెలిపించాలని కోరారు ప్రజాశాంతి పార్టీ అధినేత.