ఆయన ముందు తేలిపోతానేమో అనుకున్నా!

దక్షిణాది స్టార్ హీరోయిన్స్ లో కాజల్ ఒకరు. ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా మారిన ఈ ముద్దుగుమ్మ ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాలో నటించింది. రామ్ చరణ్ తో కలిసి గతంలో నటించిన ఈ భామ ఇప్పుడు తన తండ్రితో కలిసి నటించి రేర్ ఫీట్ ను సొంతం చేసుకుంది. సినిమాలో ఆమెది చిన్న పాత్రే అయినా.. చిరంజీవి గారి కోసం నటించానని చెబుతోంది ఈ భామ.

”కత్తి సినిమా చూసినప్పుడే నాకు హీరోయిన్ పాత్ర చిన్నదని తెలుసు. అయినప్పటికీ చిరంజీవి గారు ల్యాండ్ మార్క్ సినిమాలో భాగమవ్వాలనే ఈ సినిమా చేశాను. కొన్ని సినిమాలు పాత్రల కోసం చేస్తాం.. మరికొన్ని వ్యక్తుల కోసం చేస్తాం.. ఇది మాత్రం నేను చిరంజీవి గారి కోసం చేశాను. ఆయన యాక్టింగ్, డాన్స్ చూస్తే నేను ఆయన పక్కన తేలిపోతానేమో అని భయపడ్డాను. ఆ వయసులో కూడా ఎంతో ఎనర్జీతో డాన్స్ చేస్తూ.. ఈ తరం హీరోలకు సవాల్ విసరడం మామూలు విషయం కాదు. నటన, డాన్స్ విషయంలో ఆయన ఎన్నో మెళకువలు నేర్పించారు” అని చిరంజీవి పట్ల తన అభిమానాన్ని చాటుకుంది.