మేకప్‌ లేని కాజల్‌ .. ఫోటోలు వైరల్‌

సినీ పరిశ్రమ.. అది ఓ రంగుల ప్రపంచం. ముఖానికి రంగు, మనసుకు ముసుగు వేసుకుని నలుగురికి వినోదం పంచడమే ఇక్కడి వారి లక్ష్యం. అలా విభిన్నమైన పాత్రలతో శభాష్‌ అనిపించుకున్న నటీమణులు ఎందరో.. అయితే ఈ ముద్దుగుమ్మలు ముఖానికి మేకప్‌ లేకుండా కెమెరా ముందుకు రావడం కష్టమే. పాత్రను బట్టి.. ముఖం రంగు, అందం మారాల్సిందే. మేకప్‌ లేని ముఖాన్ని చూపించే సాహసం నటీమణులు దాదాపు చేయరు. అలాంటిది తన అందం, అభినయంతో స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తున్న ‘చందమామ’ కాజల్‌ సహజంగా దిగిన ఫొటోల్ని సోషల్‌మీడియాలో షేర్‌ చేశారు. ఇవి కాస్త సోషల్‌మీడియాలో సంచలనంగా మారాయి. ఆమె ధైర్యానికి నెటిజన్లు, పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపించారు.

అందం అంటే మనల్ని మనం స్వీకరించుకోవడమని కాజల్‌ ఈ ఫొటోలకు క్యాప్షన్‌గా రాశారు. మేకప్‌ లేని ఫొటో షేర్ చేయడానికి ధైర్యం కావాలని ఆమె అన్నారు. మనం శారీరక ఆకర్షణకు క్రేజ్‌ ఉన్న ప్రపంచంలో జీవిస్తున్నామని చెప్పారు. అందం కోసం లక్షల రూపాయలు వెచ్చిస్తున్నామని, ఆ ఉత్పత్తులు మనల్ని అందంగా చూపిస్తున్నాయని అన్నారు. శరీరాకర్షణ ప్రతి చోటా ఉందని పేర్కొన్నారు. మనలోని భిన్నమైన వ్యక్తిని చూపించాలి అనుకోకుండా.. మనల్ని మనం సహజంగా స్వీకరించుకోవడం మొదలు పెట్టినప్పుడు నిజంగా ఆనందంగా ఉంటామని తెలిపారు. ‘మేకప్‌ మనల్ని బాహ్యంగా అందంగా తయారు చేస్తుంది. అంతేకానీ మన వ్యక్తిత్వాన్ని, ఉనికిని మారుస్తుందా?మనల్ని మనం స్వీకరించడంలోనే నిజమైన ఆనందం ఉంది’ అని కాజల్‌ పోస్ట్‌ చేశారు.