పీఆర్వోకి హీరో ఛాన్స్ ఇచ్చాడు!

సినిమా ఇండస్ట్రీ ఓ రంగుల ప్రపంచం. ఒక్కసారి గనుక ఇండస్ట్రీ అలవాటు అయిందా..? ఇక దాన్ని విడిచి పెట్టడం చాలా కష్టం. చిన్న చిన్న వేషాలు వేసుకునే వారు కూడా ఎప్పటికైనా హీరో అవ్వాలని 
కలలు కంటుంటారు. నిర్మాణ వ్యవహారాల్లో కాస్త అవగాహన ఉండే వారు పెద్ద నిర్మాతగా వెలుగొందాలనుకుంటారు. ఈ కోవలోనే సినిమాలకు పీఆర్వోలుగా వ్యవహరించే చాలా మంది నిర్మాతలు కావడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే సీనియర్ పీఆర్వో బి.ఏ.రాజు ‘ఆర్ జె సినిమాస్’ బ్యానర్ లో సినిమాలను నిర్మిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఇప్పుడు మరో పీఆర్వో మహేష్ కోనేరు కూడా నిర్మాత అవతారం ఎత్తబోతున్నాడు. నందమూరి కల్యాణ్ రామ్, ఎన్టీఆర్ ల వద్ద పీఆర్వోగా పని చేసే మహేష్ కోనేరు కొన్ని రోజుల క్రితం నిర్మాణంలోకి రానున్నట్లు అనౌన్స్ చేశారు. ‘ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్’ పేరుతో సొంత బ్యానర్ ను కూడా ప్రకటించారు. 
అయితే తాజాగా ఈ బ్యానర్ లో నిర్మించే మొదటి సినిమా విశేషాలను వెల్లడించారు మహేష్ కోనేరు. ఈ సినిమాలో హీరో మరెవరో కాదూ.. కల్యాణ్ రామ్. పీఆర్వోగా తనకు అవకాశం ఇచ్చిన కల్యాణ్ రామ్ ఇప్పుడు నిర్మాతగా కూడా నిలబెట్టడానికి ముందుకొచ్చాడు. జయేంద్ర దర్శకత్వంలో కల్యాణ్ రామ్ హీరోగా ఓ సినిమా చేయబోతున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ సినిమాను మహేష్ కోనేరు నిర్మించబోతున్నారు. కల్యాణ్ రామ్ పుట్టినరోజు సంధర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సినిమా పిసి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించడం విశేషం.