కమల్‌ నెక్ట్స్‌ మూవీ ‘క్షత్రియపుత్రుడు’ పార్ట్‌-2 !

ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌ ఒక వైపు రాజకీయాలను మరో వైపు సినిమాలను బ్యాలెన్స్‌ చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ ఏడాది ‘విశ్వరూపం2’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన త్వరలోనే శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కబోయే ‘భారతీయుడు2’లో నటించనున్నారు. దీని తర్వాత ఆయన నటించబోయే చిత్రమేంటో కూడా ప్రకటించేశారు‌. 1992లో కమల్‌హాసన్‌ కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘క్షత్రియ పుత్రుడు’. శివాజీ గణేశన్‌, రేవతి, గౌతమి ప్రధాన పాత్రలు పోషించారు. ఇళయరాజా సంగీతం అందించారు. భరతన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు కమల్‌ నిర్మాతగా, రచయితగా బాధ్యతలు నిర్వర్తించారు.

అప్పట్లో బాక్సాఫీస్‌ వద్ద ‘క్షత్రియ పుత్రుడు’ అద్భుత విజయం సాధించింది. ఐదు జాతీయ అవార్డులు గెలుచుకోవడమే కాకుండా, 65వ అకాడమీ అవార్డులకు గానూ ఉత్తమ విదేశీ చిత్రంగా భారత్‌ నుంచి ఆస్కార్ అవార్డుకు నామినేట్‌‌ అయ్యింది. 1994లో టొరంటో చలన చిత్రోత్సవంలో ఈ సినిమాను ప్రదర్శించారు. కాగా, ఇప్పుడు ఈ సూపర్‌ హిట్‌ సినిమాకు సీక్వెల్‌ చేయనున్నట్లు కమల్‌ వెల్లడించారు. ‘భారతీయుడు2’ తర్వాత ‘క్షత్రియపుత్రుడు’ పార్ట్‌-2 ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పటికే అందుకు సంబంధించిన పనులను కూడా మొదలు పెట్టినట్లు సమాచారం.