వర్మ ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ దసరాకు ప్రారంభం

నందమూరి తారక రామారావు సతీమణి లక్ష్మీ పార్వతి జీవితం ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తానని చాలా రోజుల క్రితం వర్మ ప్రకటించారు. ఈ సినిమాను లక్ష్మీ పార్వతి కోణంలో ఎన్టీఆర్‌ను చూపించబోతున్నామని అన్నారు వర్మ. ఈ చిత్రానికి ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ అనే టైటిల్‌ కూడా పెట్టి.. ఫస్ట్‌లుక్‌ విడుదల చేశారు. అయితే ఆ తర్వాత వర్మ ఈ ప్రాజెక్టు గురించి ప్రస్తావించలేదు. దీంతో సినిమా ఆగిపోయిందని భావించారు.

అయితే దసరాకు ఈ సినిమా ప్రారంభోత్సవాన్ని నిర్వహించనున్నట్లు వర్మ తాజాగా తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం వరుస ట్వీట్లు చేశారు. ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ను దసరా రోజున ప్రారంభిస్తున్నాం. జనవరి చివర్లో సినిమాను విడుదల చేస్తాం. అక్టోబరు 19న తిరుపతిలో నిర్వహించనున్న విలేకరుల సమావేశంలో మిగిలిన వివరాలు వెల్లడిస్తాను. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి ప్రవేశించిన తర్వాత చోటు చేసుకున్న సంఘటనలతో ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమా తెరకెక్కనుంది’.

‘రాకేశ్‌ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాను జీవీ ఫిల్మ్స్‌ సంస్థ సమర్పిస్తోంది. తిరుపతిలో అక్టోబరు 19న జీవీ ఫిల్మ్స్‌ అధినేత బాలగిరి ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయనున్నారు. దీనికి ఊహించని అతిథి రాబోతున్నారు. నేను నా కెరీర్‌లో పూజ నిర్వహిస్తున్న తొలి సినిమా ఇది, అందులోనూ శ్రీ బాలాజీ పాదాల చెంత ఉన్న తిరుపతిలో.. ఎన్టీఆర్‌పై ఉన్న గౌరవంతో ఈ సినిమాని చేస్తున్నా’అని వర్మ ట్వీట్లు చేశారు.‌