హాసన్ ఫ్యామిలీతో కలిసి సినిమా చేయాలనుంది!

కమల్ హాసన్ ఇద్దరు కూతుళ్ళు శృతిహాసన్, అక్షర హాసన్ లు కూడా సినిమా రంగంలోనే ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే శృతిహాసన్ దక్షిణాది స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతూ బాలీవుడ్ సినిమాల్లో కూడా నటిస్తోంది. ఇక అక్షర ఇప్పుడిప్పుడే సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తోంది. శృతి ప్రస్తుతం తన తండ్రితో కలిసి ‘శభాష్ నాయుడు’ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అక్షర కూడా తన సోదరిలానే తండ్రితో కలిసి సినిమా చేయాలనుందని తన కోరికను 
వెల్లడించింది. తన తండ్రితో పాటు మొత్తం హాసన్ ఫ్యామిలీతో కలిసి నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నానని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. 
నటన అంటే మొదటినుండి కూడా ఇష్టమని తన కుటుంబ నేపధ్యం సినిమా వాతావరణానికి సంబంధించింది కావడంతో తనకు ఈ రంగంపై మరింత ఆసక్తి పెరిగిందని ఆమె చెప్పుకొచ్చారు. నటనలో మరింత నైపుణ్యం పొందడానికి ప్రయత్నిస్తున్నానని అన్నారు. అన్ని రకాల సినిమాలు చేయాలనుందని వెల్లడించారు. అయితే ‘బుద్ధిజంలోకి మారారా..? అని ఆమెను ప్రశ్నించగా.. నా సోదరిలానే నేను కూడా నాస్తికురాలినే. అయితే బుద్దిజంపై ఆసక్తితో దాన్ని ఆచరిస్తున్నాను’ అని తెలిపారు. అలానే తన తండ్రి కమల్ హాసన్ రాజకీయాల ఎంట్రీపై తను ఏది మాట్లాడనని అది పూర్తిగా నాన్నగారి ఇష్టమని అన్నారు. ప్రస్తుతం అక్షర హాసన్.. అజిత్ హీరోగా నటిస్తోన్న ‘వివేకం’ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాతో తనకు మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నారు.